శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు( జమ్ము కశ్మీర్, లడఖ్) గా ప్రకటించింది. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను రద్దు చేయగా, శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమం లోనే తనతో పాటు పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారని మాజీ సిఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చేస్తోన్న తప్పుడు వాదనలు మరోసారి నిరూపితమయ్యాయని విమర్శించారు.
ఆర్టికల్ 370 పై విచారణ చేపడుతోన్న వేళ, సుప్రీం కోర్టు ఈ పరిణామాలను పరిగణన లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తమ ప్రధాన కార్యాలయానికి తాళం వేశారని, ఎవరినీ అనుమతించడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన వేళ , స్థానికంగా భారీ బందోబస్తు చేపట్టారు. ఈ క్రమం లోనే శనివారానికి జమ్ము బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఎవరినీ యాత్రకు అనుమతించలేదు. దీంతో వందలాది యాత్రికులు క్యాంపులకే పరిమితమయ్యారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇటీవలే వాదనలు మొదలయ్యాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్భంగా దేశ ప్రజల తరుఫున తాను ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.