న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వ పునరుద్ధరణ తక్షణం జరగాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పరువునష్టం దావాలో రాహుల్‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం దక్కింది. ఇక ఆయనను తిరిగి ఎంపిగా తీసుకోవడంపై సంబంధిత అన్ని పత్రాలను తాము స్పీకర్ ఓంబిర్లాకు పంపించినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి శనివారం తెలిపారు. స్పీకర్ ఈ విషయంలో తన నిష్పక్షపాతాన్ని ప్రదర్శించుకోవాలి. గుజరాత్ కోర్టు తీర్పు వెలువడగానే తక్షణం రాహుల్‌పై వేటేశారు.
ఇదే వేగంతో తిరిగి ఆయన సభ్యత్వ పునరుద్ధరణకు స్పీకర్ స్పందించాల్సి ఉందని చౌదరి స్పష్టం చేశారు. తాను గత రాత్రి, తిరిగి ఈ రోజు ఉదయం స్పీకర్ ఓంబిర్లాను కలిసినట్లు, విషయం తెలిపినట్లు వివరించారు. పునరుద్ధరణ సంబంధిత పత్రాలన్నింటిని తాము స్పీకర్ కార్యాలయానికి పంపించినట్లు , శనివారం సెలవు వల్ల సెక్రెటరీ జనరల్ ఆఫీసు మూసిఉందని చెప్పారు.
అప్పట్లో గంటల వ్యవధిలోనే రాహుల్‌పై సభలో అనర్హత వేటేశారు కదా, మరి సుప్రీంకోర్టు నుంచి స్టే వెలువడి 26 గంటలు దాటిపోయినా ఇప్పటివరకూ ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. ప్రధాని మోడీకి అవిశ్వాస తీర్మానం దశలో సభలో రాహుల్ భయం పట్టుకున్నట్లుగా ఉందని, దీనితోనే ఎంపి సభ్యత్వ పునరుద్ధరణకు బ్రేక్‌లు పడుతున్నాయని విమర్శించారు.