న్యూయార్క్ : అమెరికా మహానగరం న్యూయార్క్‌లో కేవలం 21 ఏండ్ల యూట్యూబర్ , ఆటపాటల వీడియోల ఫేమ్ కై సీనట్ సంచలనం రేపాడు. ఆయన ప్రకటనతో నగరంలో పెద్ద ఎత్తున ఆయన ఫాన్స్ వీధుల్లోకి రావడం, ఆయనను చూసేందుకు అరాచకంగా వ్యవహరించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చాలాసేపటివరకూ వీధులు రణరంగంగా మారాయి. పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. ఘర్షణలకు దారితీశాయి.
ఆన్‌లైన్ ద్వారా ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ ఆన్‌లైన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇటీవల ఓ ప్రకటన వెలువరించారు. తాను మన్‌హటన్ యూనియన్ స్కేర్ పార్క్‌లో ప్రత్యక్ష సంగీత కచేరీ ఏర్పాటు చేస్తానని, తన ఫాన్స్‌ను కలుస్తానని, పనిలో పనిగా వీరికి భారీ స్థాయిలో కానుకలు అందిస్తానని తెలిపాడు. దీనితో అమెరికాలో శుక్రవారం జనసమ్మర్థపు న్యూయార్క్ వీధులలో మరింతగా జనం పోగయ్యారు. న్యూయార్క్ స్థానికుడు కావడం, ఆయనకు గత ఏడాది స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ కావడంతో దాదాపుగా 65 లక్షల మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
వీరిలో అత్యధికులు నగరానికి చేరడంతో వీరిలో యువతరం తన హీరోను కలిసేందుకు పోటాపోటీగా దూసుకువెళ్లడం, మార్గమధ్యంలో వాహనాలపై బీరు బాటిల్స్ వేయడం, విధ్వంసానికి పాల్పడటంతో పరిస్థితి చేజారింది. ఈ స్ట్రీమర్ సభ రద్దు అయింది. భద్రతా కారణాలతో ఆయనను వ్యక్తిగత భద్రతా సిబ్బంది వేరే చోటికి చేర్చారు. స్థానిక పోలీసులు ఈ అల్లర్లకు అనుకోని మూలకారకుడిని ఇప్పుడు విచారిస్తున్నారు. శాంతిభద్రతలు దిగజారేలా చేశాడనే అభియోగాలపై ఆయనపై క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం అయింది.