న్యూఢిల్లీ: తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీచేసిన దరిమిలా కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆయనకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు అభినందనలతో స్వాగతం పలికారు. ఇది సత్యానికి, న్యాయానికి దక్కిన విజయంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభివర్ణించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణకు సంబంధించిన వార్త వెలువడిన వెంటనే ఎఐసిసి ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి.
మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, దాన్ని నిలుపుదల చేయడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు ఊరట లభించిన విషయం తెలిసిందే. జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీచేసింది. ఆయనపై విధించిన అనర్హతను తొలగిస్తున్నట్లు తెలిపింది.
పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందు తన చాంబర్‌లో సమావేశమైన ప్రతిపక్ష ఇండియా కూటమికె చెందిన ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్)లో వేసిన పోస్టులో రాహుల్ గాంధీని ఎంపి పదవిని పునరుద్ధరించడం భారత ప్రజలకు, ముఖ్యంగా వయనాడ్ ప్రజలకు గొప్ప ఊరటగా ఖర్గే అభివర్ణించారు. తనకు మిగిలిన సమయాన్ని మోడీ ప్రభుత్వం, బిజెపి వాస్తవ పాలనపై కేంద్రీకరించాలని, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు.
కాగా..రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ పునరుద్ధరణతో ప్రజాస్వామ్యం గెలించిని, ఇండియా గెలించిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విపి మాణిక్కం టాగోర్ స్పందిస్తూ కుగ్ర ఓటమి చెందిందని, రాహుల్ గాంధీ తిరిగి వచ్చారని, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే బిజెపి నాయకుడు సుశీల్ మోడీ మాత్రం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌పై పడిన నింది ఇంకా పూర్తిగా చెరిగిపోలేదని, ఆయనకు విధించిన శిక్షై స్టే మాత్రమే వచ్చిందని సుణీల్ మోడీ వ్యాఖ్యానించారు. రాహుల్ అప్పీలుపై సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. స్టే రావడమన్నది సాధారణ ప్రక్రియనేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా ఉండగా, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులు మొహమ్మద్ ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వాలు కూడా పునరుద్ధరణ జరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.