బిఆర్‌ఎస్ టికెట్ రాని వారికోసం ఎదురుచూపులు
వలస నేతలు రాకపోతే నామమాత్రపు అభ్యర్ధులే దిక్కు
ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో అదే సీన్
కీలకనేతలకు టికెట్ వల.. అయినా పడని నేతలు
రంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ ఆశలన్ని ఓవర్‌లోడ్‌తో నిండిన కారు పైనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో పరాజయం పాలైన హ స్తం పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వలసలతో కుదేలైంది. కీలకనేతలతో పాటు జిల్లా స్థాయిలో పట్టున్న నేతలంతా కారు పార్టీలో చేరిపోవడం….కొంత మంది మౌనమునులుగా మారడంతో మెజారిటీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి నియోజకవర్గ స్థాయి నాయకుల కొరత ఎర్పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి పలు నియోజకవర్గాలో అదికార టిఆర్‌యస్ పార్టీని డికొట్టి విజయం సాధించే నాయకులు లేకపోవడంతో వలసనేతలపై ఆశలు పెంచుకుంది.
2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన నాయకులు సైతం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో కారు పార్టీలో చేరడంతో అక్కడ ఓవర్‌లోడ్ అయింది. ఓవర్‌లోడ్‌తో ఉన్న కారు పార్టీలో దాదాపు సిట్టింగ్‌లకు టికెట్ దక్కడం ఖాయమని గులాబీ బాస్ పలుమార్లు స్పష్టం చేయడంతో టికెట్ ఆశీస్తున్న నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
కాంగ్రెస్ ప్రయత్నాలకు ఇప్పటివరకు పెద్ద నేతలు ఎవరు దొరకకపోయిన అంతర్గతంగా టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా స్థాయిలో కీలకమైన నేతలతో హస్తం పార్టీ సంప్రదింపుల పర్వం కొనసాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కర్ణాటక కాంగ్రెస్ కీలకనేతలు జిల్లా నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది.
టికెట్ రాని వారికోసం ఎదురుచూపులు: బిఆర్‌ఎస్‌లో టికెట్ రాని వారిని తమ పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దింపాలని హస్తం నేతలు ఆశ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాలలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. చెవెళ్ల కాంగ్రెస్ టికెట్ గత ఎన్నికలలో బిఆర్‌ఎస్ నుంచి వలసవచ్చిన మాజీ ఎమ్మెల్యే కె. యస్.రత్నంకు ఇచ్చి బరిలోకి దించారు.
ఎన్నికలలో పరాజయం పాలైన అనంతరం రత్నం మరోమారు కారు ఎక్కి వెళ్లిపోయారు. చేవెళ్లలో ప్రస్తుతం సైతం మండలానికి ఒక ఆశావాహూడు ఉన్న సిట్టింగ్ శాసనసభ్యుడు కాలే యాదయ్యను బలంగా డికొట్టే నాయకుడు లేకపోవడంతో వలసనేతలపై ఆశలు పెట్టుకున్నారు. తాండూర్‌లో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాదించిన పైలేట్ రోహిత్ రెడ్డి అనంతరం పరిణామాలతో కారు ఎక్కడంతో తాండూర్‌లో సైతం వలసనేతల కోసం వేచిచూస్తున్నారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లిలో సైతం ఇదే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేంద్రనగర్‌లో మూడు సార్లు విజయం సాధించిన ప్రకాష్ గౌడ్‌ను డికొట్టే నాయకులు లేక వలసలపై ఆశలు పెట్టుకున్నారు.
మహేశ్వరంలో సబితారెడ్డితో తలపడే నాయకులు కరువై ఇటివల బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాతను, అనంతరం 2014లో బిఆర్‌యస్ అభ్యర్దిగా బరిలోకి దిగి పరాజయం పాలైన మనోహర్ రెడ్డిలకు కాంగ్రెస్ కండువ కప్పిన ఫలితం లేక మరోనేత కోసం ఆశగా చూస్తున్నారు. శేరిలింగంపల్లిలో సైతం ఎవరో వచ్చి బరిలోకి దిగి తమను గెలిపిస్తారని ఆశించడం తప్ప స్వంత పార్టీలో నియోజకవర్గ స్థాయిలో నాయకులు కరువయ్యారు. షాద్‌నగర్‌లో సైతం స్థానికంగా నాయకుడు పార్టీ కోసం కష్టపడుతున్న వలసనేత కోసం రెడ్‌కార్పెట్ వేసి ఎదురుచూస్తున్నారు.
హస్తం వలకు చిక్కని కారు నేతలు : మీకు టికెట్ కేటాయిస్తాం…మీరు చెప్పిన వారికి కూడ మరోసీటు ఇస్తామని హస్తం నేతలు విసురుతున్న వలకు కారు పార్టీ కీలకనేతలు ఇప్పటివరకు ఎవరు చిక్కడం లేదు. మాజీ మంత్రితో ఇప్పటికే రాయబారాలు జరిపినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఆయన మాత్రం కారు పార్టీలోనే కొనసాగడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంపి, ఎమ్మెల్యే టికెట్‌లు ఆఫర్ చేసిన ఆయన మాత్రం ఇంకా కారు దిగడానికి దైర్యం చేయడం లేదు. మహేశ్వరం, మేడ్చల్, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లో సైతం కీలకనేతలకు గాలం వేసిన ఇంతవరకు ఎవరు హస్తం గాలంకు చిక్కలేదు. హస్తం పార్టీ మాత్రం వలసనేతలకు గాలం వేస్తు ఇంకా ఆదే ఆశలు కొనసాగుతుంది.