Thursday, January 9, 2025

లాభాల్లో సూచీలు.. పేటిఎం షేర్లలో జోరు

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా ఐటి, హెల్త్‌కేర్ రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్లు మద్దతు కలిసొచ్చింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ముంగిట మదుపరులు అప్రమత్తత పాటిస్తుండడంతో సూచీలు ఓ మోస్తరు లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 65,811.40 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది.

ఓ దశలో 66 వేల మార్కును టచ్ చేసినప్పటికీ చివరికి 232.23 పాయింట్ల లాభంతో 65,953.48 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.30 పాయింట్లు లాభపడి 19,597.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.74గా ఉంది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, టిసిఎస్, ఇన్ఫీ షేర్లు లాభపడడాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి. పేటీఎం షేర్లలో చాలా రోజుల తర్వాత మంచి యాక్టివిటీ కనిపించింది.

పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు ఓ దశలో 11 శాతం మేర లాభపడ్డాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటిఎంలో యాంటిఫిన్ హోల్డింగ్ బీవీ (నెదర్లాండ్స్) నుంచి 10.30 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నారన్న వార్తలు ఇందుకు నేపథ్యం. మార్కెట్ ముగిసే సమయానికి పేటిఎం షేర్లు 6.83% లాభంతో రూ.851.00 వద్ద ముగిశాయి. టివిఎస్ మొబిలిటీకి చెందిన టివిఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్ ఐపిఓ తేదీ ఖరారైంది. ఆగస్టు 10 నుంచి 14 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. రూ.880 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తున్న ఈ ఐపీఓలో ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.187-197గా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News