హైకోర్టు అనర్హత తీర్పుపై సుప్రీం స్టే
హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమాపై అనర్హత వేటు వేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. కాగా, తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో కొత్తగూడెం సిట్టింగ్ ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల వేటు వేసింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. ఈ మేరకు ఎంఎల్‌ఎగా జలగం వెంకట్రావును ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తున్నారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని విజేతగా కోర్టు ప్రకటించింది. వనమా వెంకటేశ్వరావు ఫారం 26లో భార్య ఆస్తి వివరాలు, స్థిరాస్థుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోవడంపై హైకోర్టులో జలగం వెంకట్రావ్ పిటిషన్ చేశారు.
ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావుపై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్ తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడించనుందుకు ఐదు లక్షల జరిమానా కూడా విధించినట్లు వివరించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వ రరావు ఆ తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జలగం వెంకట్రావు తనను ఎంఎల్‌ఎగా గుర్తించాలని ప్రమాణ స్వీకారం చేయించాలని అధికారులను , బిఆర్‌ఎస్ పెద్దలను కలిశారు. కొత్తగూడెం ఎంఎల్‌ఎగా వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేశారు. స్పీకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. అయితే ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే త్చెచుకున్నారు.