Monday, November 25, 2024

టీమిండియాకు చావో రేవో

- Advertisement -
- Advertisement -

గయానా: వెస్టిండీస్‌తో మంగళవారం జరిగే మూడో టి20 మ్యాచ్ టీమిండియాకు చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇక తొలి రెండు టి20లలో విజయం సాధించిన ఆతిథ్య వెస్టిండీస్ సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. రెండో టి20లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా విండీస్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశారు. ఒకదశలో విండీస్‌కు ఓటమి ఖాయంగా కనిపించింది. కానీ పూరన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్‌లు అసాధారణ పోరాట పటిమతో భారత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.

ఇలా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బలమైన భారత్‌ను ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మూడో టి20లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉండడంతో విండీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న కరీబియన్ టీమ్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సమష్టిగా రాణిస్తే టీమిండియాను ఓడించడం ఆ జట్టుకు అసాధ్యమేమీ కాదు. ఈసారి కూడా పూరన్ జట్టుకు కీలకంగా మారాడు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, మేయర్స్‌లు బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంది. హెట్‌మెయిర్, కెప్టెన్ పొవెల్, ఆల్‌రౌండర్ హోల్డర్ తదితరులు చెలరేగితే భారత్‌కు కష్టాలు ఖాయం. ఈ మ్యాచ్ కూడా గయానాలోనే జరుగనుంది.

గెలిచి తీరాల్సిందే..
మరోవైపు టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో కీలకమైన మూడో టి20 భారత్‌కు సవాల్‌గా తయారైంది. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారు. టీమిండియా వరుస ఓటములను బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాలి. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఓపెనర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ తదితరులు కూడా ఘోరంగా విఫలమవుతున్నారు.

కీలకమైన ఆటగాళ్లుగా ఉన్న వీరు జట్టుకు అండగా నిలువలేక పోతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. మూడో టి20లో బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దకుంటేనే టీమిండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News