ప్రభుత్వ రిటైర్ట్ పెన్షనర్ల సంఘం హర్షం
అనంతరం గద్దర్‌కు సంతాపం తెలిపిన నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశమే ఆశ్చర్య పోయేలా ఉద్యోగులకు ఐఆర్ సహా ఉద్యోగులకు పెన్షన్లు దశల వారీగా పెంచుతామంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించడం పట్ల తాము అత్యంత సంతోషంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రకటించారు. సిఎం ప్రకటన నేపథ్యంలో బడి చౌడిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ సి. చంద్రశేఖర్‌లు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన అత్యంత సంతోషకరమని, 2వ పిఆర్‌సి నియమించి ఐఆర్‌ను కూడా దేశంలోనే అత్యధికంగా ఇస్తామని ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పెన్షనర్ల పక్షాన ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ పరిపాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నామన్నారు. ముఖ్యంగా పెన్షనర్ల హెల్త్ కార్డు , కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 12 సం.లకు తగ్గించడం వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారని, మిగతా చిన్న చిన్న సమస్యలను అధికారులు, పెన్షనర్ల సంఘనాయకులతో చర్చించి పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటారని పూర్తి విశ్వాసముతో ఉన్నట్లు వారు తెలిపారు.
గద్దర్‌కు పెన్షనర్ల సంతాపం…
ప్రజాయుద్ద నౌక గద్దర్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంతాపం తెలియజేసింది. గద్దర్ గొంతు మూగ బోయినా ఆయన ఆశయం చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్బంగా జరిగిన సంతాప సభలో రాష్ట్ర ట్రెజరర్ ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన వి. విశ్వనాథ్, గుండం మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శాంరావు, ప్రహ్లాద్ రావు పాల్గొన్నారు.