Monday, December 23, 2024

హరితహారం లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయించాలి
85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలి
అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించిన సిఎస్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కింద నిర్థారించిన లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయడంతో పాటు దాదాపు 85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. తెలంగాణాకు హరితహారం, దశాబ్ధి సంపద వనాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడం, గొర్రెల పంపిణీ, బిసి, మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూమిపట్టాల పంపిణీ, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ, విఆర్‌ఓల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై కలెక్టర్‌లతో సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దశాబ్ది సంపద వనాల కింద నిర్ధారిత లక్ష్యాలను పూర్తిగా చేపట్టడంతో పాటు ఈ వనాలకు ఫెన్సింగ్ చేపట్టి బోర్డులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. సంపద వనాలకు కావాల్సిన ప్రహరీ గోడల నిర్మాణానికి అవసరమైతే హరితనిధి నుంచి నిధులను మంజూరు చేయాలని ఆమె పేర్కొన్నారు.
కోటి మొక్కలను ఒకేరోజు నాటాలి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్బంగా కోటి మొక్కలను ఒకేరోజు నాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించినందున, ఈ మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాల ఎంపిక, కందకం తవ్వకం పూర్తి చేసి ఉంచాలన్నారు. ఈ కోటి మొక్కలు నాటే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సిఎస్ పేర్కొన్నారు.
కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి
రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఉన్న 1266 మందికి సంబంధించి కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని సిఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్‌లను జూనియర్ అసిస్టెంట్‌లుగా అప్-గ్రేడ్ చేస్తూ ఇటీవలే ప్రభుత్వం 79 నెంబర్ జిఓ విడుదల చేసినందున వెంటనే నియామకాలు పూర్తిచేయాలని సిఎస్ స్పష్టం చేశారు.
నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ
ఎంతోకాలంగా ప్రజలు కోరుతున్న నోటరీ స్థలాల క్రమబద్దీకరణకై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు జీఓ 84 ను విడుదల చేస్తామని సిఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని ఉచితంగా, అంతకు పైగా విస్తీర్ణంలో ఉండే స్థలాలను స్టాంపు డ్యూటీ మొత్తంతో పాటు, చదరపు అడుగుకు కేవలం 5 రూపాయలు అదనంగా చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని సిఎస్ తెలిపారు. ఈ పథకాన్ని విస్తృతస్థాయిలో వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పర్చాలని సిఎస్ కోరారు. దీనికిగాను వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్‌లను సిఎస్ ఆదేశించారు. జిఓ 59 క్రింద ఇప్పటికీ నోటీసులు అందుకున్న వారిని నుంచి రెగ్యులరైజేషన్‌కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని శాంతికుమారి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో…
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, పిసిసిఎఫ్ డోబ్రియల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జీఏడి కార్యదర్శి శేషాద్రి, రవాణా, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి, ఆర్ధిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News