ఇంఫాల్ : మణిపూర్‌లో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల నుంచి అస్సాం రైఫిల్స్ బలగాలను తప్పించాలని మైతేయ్ వర్గం మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో కల్లోలిత ప్రాంతాల నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారి స్థానంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ బలగాలను మోహరించింది. ఈ మేరకు సోమవారం రాత్రి మణిపూర్ అదనపు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బిష్ణుపుర్ కంగ్వాయ్ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పాయింట్‌లో ఇకపై సిఆర్‌పిఎఫ్ విధులు నిర్వహిస్తాయని తెలిపారు. గత మూడు నెలలుగా అస్సాం రై ఫిల్స్, మణిపూర్ పోలీస్ కమాండోలకు మధ్య వాగ్వివాదం జరుగుతున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు అస్సాం రైఫిల్స్ తమ పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని మైతేయ్ వర్గం మహిళలకు చెందిన మీరా పైబీ అనే సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రహదారులపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మహిళలు సహా పౌరులతో అస్సాం రైఫిల్స్ సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా మైతేయ్‌లను లక్షంగా చేసుకున్నారని ఆరోపించారు. వారిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కీలక చెక్‌పాయింట్ల బాధ్యతలను సీఆర్‌పిఎఫ్‌కు అప్పగిస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
మణిపూర్ విద్యార్థుల భద్రతకు భరోసా
దేశం లోని వివిధ రాష్ట్రాల్లో చదువుకొంటున్న మణిపూర్ విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఊకే , గవర్నర్లు, ఎల్జీలకు లేఖ రాశారు. దీనిపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ఎల్జీల నుంచి కూడా సానుకూల స్పందన లభించినట్టు మణిపూర్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మణిపూర్ విద్యార్థులకు తక్షణ సాయం అవసరమైతే , నేరుగా ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్ కార్యాలయాలను సంప్రదించవచ్చని వారు లేఖలో పేర్కొన్నట్టు వెల్లడించింది.