70% స్కోర్ సాధించినవారికి నియామక ఉత్తర్వులు 6నెలల పాటు మిగతా వారి పనితీరు పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించి న అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించి, నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన జెపిఎస్‌లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సం దీప్‌కుమార్ సుల్తానీయా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తక్కువ స్కోర్ చేసిన వారి పనితీరును ఆరు నెలల పాటు పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు, ఇతర వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ని యామక ఉత్తర్వులను కూడా నమోదు చేయాలని పేర్కొంది. పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో కార్యదర్శులను రాతపరీక్ష ద్వారా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమించింది.
ఇటీవల జెపిఎస్‌ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల పని తీరుపై జిల్లా స్థాయి మూల్యాంకన కమిటీకి మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా వారు అందజేసిన నివేదికలో 70శాతం కంటే ఎ క్కువ మార్కులు సాధించిన జూనియర్ పంచాయ తీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ చే యాలని కలెక్టర్లకు ఆదేశించింది. నిర్దేశించిన అం శాల వారీగా 70 శాతం మార్కులు సాధించిన పం చాయతీ కార్యదర్శులు ఐదు వేల లోపే ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారితో పాటు ఒప్పంద పం చాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారి క్రమబద్దీకరణ ప్రశ్నార్థకంగా మారిందని జెపిఎస్‌లు వాపోయారు.
క్రమబద్దీకరణకు షరతులు సరికాదు..
జీవో 617 ప్రకారం మూడేళ్లు పూర్తయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూదన్‌రెడ్డి కోరారు. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో నాలుగు సంవత్సరాలు పూర్తయి, 70 మార్కులు వస్తేనే క్రమబద్దీకరించాలని ఆదేశించడం సరికాదన్నారు. నోటిఫికేషన్ ద్వారా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను భేషరతుగా క్రమబద్దీకరించాలని కోరారు. నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వారు రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత రెగ్యులర్ అవుతారు, వీరికి నాలుగేళ్లు పెట్టి, రెండేళ్ల ప్రొహిబిషన్ కూడా ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని కోరారు.