Saturday, November 23, 2024

అభివృద్ధికి నోచుకోని గిరిజీవనం

- Advertisement -
- Advertisement -

ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. స్వచ్ఛమైన సెలయేళ్లు దట్టమైన అడవులు, గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి అందాలు, వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యం గా పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ గిరిజన జనం నివసిస్తోంది. అడవి తల్లి బిడ్డలుగా ప్రకృతి వొడే ఆవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఆదివాసీల జీవన స్థితిగతులు మారలేదు.

ఆదివాసుల హక్కు పరిరక్షణ కోసం 1994లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బ్రెజిల్, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసీ తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని ‘ముచి-పిచి’ పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50 నుంచి 60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి. తాము వేటాడే జంతువులకు ఎరగా వేసే క్యురారే మొక్క నేడు ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్సకు ఔషధంగా మారింది.

ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో గిరిజన తెగలు మాట్లాడే భాషలే నాలుగు వేలు ఉన్నాయి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బతుకు పోరాటంలో ఆరితేరిన వారు గిరిజనులు. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. ‘అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం, తద్వారా జీవించే హక్కుతో సహా ఆధునిక మానవునికి గల అన్ని హక్కులూ వారికి ఇవ్వవలసి ఉన్నది అని 1994 డిసెంబర్ 23న ఐక్కరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలంపాటు ఆదివాసీ తెగలను గుర్తించి, వారిని చట్ట పరిధిలోకి తీసుకు రావాలి.

ఈ పదేళ్ల పాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితులను మెరుగుపర్చడం, వారి నివాస ప్రాంతాలలోని సహజ వనరులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్న ది. ఇది 1995 నుంచి 2004 వరకు వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలు, అధ్యయనాలు చేయవలసి ఉన్నది. రెండవ దశాబ్దంలో 2005 నుంచి 2015 వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం, తగిన హోదా కల్పించవలసి ఉంది. పై తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసినా, అమలు చేసిన దేశాలు కేవలం 60 మాత్రమే. ఈ 60లో భారత దేశం లేదు. మన దేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడం లేదు. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. ఆదివాసుల సంరక్షణ, అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 16 (4), 46, 275, 330, 332, 243డి, 5, 6 షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికారాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి వల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాల మేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం.

పీసా చట్టం (పి.ఇ.ఎస్.ఎ-1996)లో చేయబడింది. అయినా పాలక వర్గాలు మన దేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు. ఆదివాసీలు -హక్కులు వలస కాలం నుంచి మన దేశంలో గిరిజన తెగలు, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా 1874లోనే ప్రత్యేక షెడ్యూల్ జిల్లాల చట్టం చేయబడింది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వబడ్డాయి. అవే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేయబడింది. చట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివేయాల్సి ఉంది. బాక్సైట్ త్రవ్వకాలు వద్దని విశాఖ జిల్లాలోని గ్రామ సభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్ త్రవ్వకాలు జరుపుకున్నది.

ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడడం లేదు. షెడ్యూల్డ్ ప్రాంతంలో జిఒ 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయాలలో నేడు స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా లేరు. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్కతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు. స్కూలులో తెలుగు, ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసుకోవడం గిరిజన విద్యార్థులకు కష్టంగా ఉన్నది. యునెస్కో సూచన మేరకు 10 వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుకలో దానికి రక్షణనివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగుతున్న ఉత్సవాలు పాలక వర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ గిరిజన దినోత్సవం అంటే వారి ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా, అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నది.

డా. ఆర్. చంద్రు
9704629649

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News