Friday, December 20, 2024

ఢిల్లీలో సుప్రీం తీర్పుకి విఘాతం!

- Advertisement -
- Advertisement -

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమాఖ్య సంబంధాలుగా పరిగణించాలనడం ఎన్‌డిఎకి సారథ్యం వహిస్తున్న బిజెపి పాలకులకు బొత్తిగా నచ్చదనేది అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తన చెప్పుచేతల్లో నడుచుకోవాలని ఆశించే ఈ పాలకులు అందుకు అంగీకరించని వారిని ఇడి, సిబిఐ, రాబడి పన్ను అధికారుల దాడులతో, అక్రమ అరెస్టులతో రాచిరంపాన పెడుతున్నారు. ఇటువంటి వారు తమ సింహాసనం నీడలో గల ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం స్వతంత్ర రాష్ట్రంగా వుండడం ఎంత మాత్రం సహించబోరు. బిజెపి దృష్టిలో రాజ్యాంగానికే విలువ లేదు. ఢిల్లీ రాష్ట్ర పాలన విషయంలో రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమాఖ్య వ్యవస్థ నియమాలను పాటించి తీరాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు గౌరవిస్తారని ఎదురు చూడలేము.

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని సర్వీసులపైన, వాటి ఉన్నతాధికారి వర్గంపైన అదుపు అక్కడి ప్రజలు ఎన్నుకొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వుండాలని సుప్రీంకోర్టు గత మే 11న ఇచ్చిన తీర్పు అమలు కాకుండా చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఆ వెంటనే ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దానిని పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశంలో ఆమోదింప చేసుకోవాలని దీక్ష వహించింది. రాజ్యసభలో తమకు గల సంఖ్యాబలంతో దాని ఆటలు సాగకుండా చేయాలని ప్రతిపక్షాలు ఉమ్మడి బలాన్ని సమీకరించుకొన్నప్పటికీ వాటి ఆకాంక్ష నెరవేరలేదు. బిజెపి తనకున్న అపరిమితమైన అధికారాలతో మెజారిటీని కూడగట్టుకొని రాజ్యసభలో కూడా బిల్లును ఆమోదింప చేసుకొని దానికి శాసన రూపం ఇచ్చుకోగలిగింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 పడ్డాయి.

బిజూ జనతాదళ్, వైఎస్‌ఆర్‌సిపి ఎంపిల మద్దతుతో బిల్లు నెగ్గింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని పాలనా సర్వీసులపై ఆ రాష్ట్ర ప్రభుత్వానివే సర్వాధికారాలని సుప్రీంకోర్టు ధర్మాసనం గత మే నెలలో ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. సమాఖ్య పద్ధతి పాలనలో సివిల్ అధికారులు ఓటర్లకు జవాబుదారీగా వుండాలని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ ఒకే పద్ధతి పాలనలో వుండవలసిన పని లేదని గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు, పోలీసు, భూవ్యవహారాలు మినహా మిగతా అంశాలన్నీ రాజ్యాంగం విభజించిన మాదిరిగా రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో వుంటాయని 2018లో తీసుకొన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. రాజ్యాంగం 239 ఎఎ ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతం మొత్తానికి గాని, అందులోని కొంత భాగానికి గాని వర్తించేలా చట్టాలు చేసే అధికారం ప్రజలెన్నుకొన్న ఢిల్లీ రాష్ట్ర శాసన సభకు వుంటుందని వివరించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) కు కేవలం శాంతి భద్రతలు, పోలీసు, భూవ్యవహారాల మీద మాత్రమే అధికారాలు వుంటాయని, మిగతా అన్ని విషయాల్లో రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు లోబడి ఎల్‌జి పని చేయవలసి వుంటుందని గత మే నెల తీర్పులో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల ప్రభుత్వాల మాదిరిదేనని ప్రకటించిన తర్వాత దానిని అమలు కానీయకుండా లెఫ్టినెంట్ జనరల్‌కు పూర్వమున్న ఎదురులేని అధికారాలను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేయించడం దాని అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం.

బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ జాతీయ రాజధాని ప్రాంతంలో అవినీతికి చోటులేని పాలన ఇవ్వడం కోసమే ఆ బిల్లును తెచ్చినట్టు ప్రకటించారు. అంటే అవినీతిలేని స్వచ్ఛమైన పాలన తామే ఇవ్వగలమని, కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆ సామర్థం, చిత్తశుద్ధి లేవని ఆయన చెప్పుకొన్నారు. ఇంతకంటే బరితెగింపు మరొకటి వుండదు. ముఖ్యమంత్రి సారథ్యంలో ముగ్గురు సభ్యుల పాలనాధికార వ్యవస్థను ఏర్పాటు చేయదలచిన బిల్లు ఆ ముగ్గురిలో ఇద్దరి హాజరుతో నిర్ణయాలు తీసుకోవచ్చని, ఆ విధంగా ముఖ్యమంత్రి హాజరు కాకపోయినా సమావేశాన్ని జరిపించవచ్చని నిర్ణయించడం ఏ విధంగా ప్రజాస్వామికం కాగలుగుతుంది? ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రి లేకుండా పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని దానికి కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం? ఆ ముగ్గురూ కలిసి ఏకగ్రీవంగా తీసుకొనే నిర్ణయాన్ని కూడా త్రోసిపుచ్చే అధికారం ఎల్‌జికి కట్టబెట్టడం కంటే నిరంకుశత్వం వేరొకటి వుంటుందా? ఇంతటి ప్రజాస్వామ్య విరుద్ధమైన ఆర్డినెన్స్ చట్టం అయిన తర్వాత చేయగలిగిందేముంటుంది? ఇప్పటికే ఆప్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కనుక అక్కడి నుంచి అంతిమ తీర్పు వచ్చే వరకు వేచి చూడవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News