Monday, December 23, 2024

ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌లో మార్పులు చేసిన మ్యాచ్‌ల వివరాలను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధికారికంగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన మ్యాచ్ తేదీని మార్చారు. తాజా షెడ్యూల్ ప్రకారం దాయాదిల మధ్య అక్టోబర్ 14న ఈ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం దీనికి వేదికగా నిలువనుంది. దసరా నవరాత్రి వేడుకలను దృష్టిలో పెట్టుకుని భద్రత కారణాల దృష్టా ఈ మ్యాచ్‌ను ఒక రోజు ముందు నిర్వహించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌తో పాటు మరో 8 మ్యాచ్‌లను కూడా రీ షెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ ప్రకారం ఏ తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయో కూడా బిసిసిఐ వెల్లడించింది. రీ షెడ్యూల్‌లో ఇంగ్లండ్ ఆడే మ్యాచ్‌లు అధిక సంఖ్యలో నాలుగు ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు సంబంధించి మూడేసి ఉన్నాయి. భారత్ ఆడే రెండు మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేశారు. ఆస్ట్రేలియా ఆడే రెండు మ్యాచ్‌లు కూడా రీ షెడ్యూల్ అయ్యాయి. కాగా అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఇందులో మొత్తం పది జట్లు పోటీ పడనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 9 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఈ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగుతాయి. కాగా, లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తుది సమరం నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. కాగా, అక్టోబర్ ఐదున అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తుంది.

అహ్మదాబాద్, హైదరాబాద్, ధర్మశాల, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, పుణె, ముంబై నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఆతిథ్య దేశం భారత్‌తో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు పాల్గొంటున్నాయి. రెండు సార్లు విశ్వ విజేతగా ఉన్న వెస్టిండీస్ ఈసారి వరల్డ్‌కప్ అర్హత సాధించడంలో విఫలమైంది. ఆ జట్టు లేకుండానే ఈసారి వరల్డ్‌కప్ జరుగనుండడం విశేషం.

రీ షెడ్యూల్ వివరాలు..
అక్టోబర్ 10న ఇంగ్లండ్-బంగ్లాదేశ్
అక్టోబర్ 10న పాకిస్థాన్-శ్రీలంక
అక్టోబర్ 12న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా
అక్టోబర్ 13న ఇంగ్లండ్-బంగ్లాదేశ్
అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్
అక్టోబర్ 15న ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్
నవంబర్ 11న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్
నవంబర్ 11న ఇంగ్లండ్-పాకిస్థాన్
నవంబర్ 12న భారత్-నెదర్లాండ్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News