Monday, December 23, 2024

కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టరేట్ ఎదుట 2వ రోజు కార్మిక సంఘాల ధర్నా

హన్మకొండ ప్రతినిధి: కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, సీఐటీయూ జిల్లా నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌టీయూ జిల్లా నాయకుడు నాయిని రవి, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు అప్పారావు అన్నారు.

గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రెండో రోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను, కార్మిక వర్గ సమస్యలను గాలికొదిలేసి కార్పొరేటు సంస్థలకు ఊడిగం చేస్తుందన్నారు. 73 శాతం సంపద ఒక్క శాతం ఉన్న సంపన్నుల వద్ద కేంద్రీకృతమైందన్నారు. దీని వల్ల నిరుద్యోగం, కనీస వేతనం, గిట్టుబాటు ధర, దారిద్య్రం, వలస సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు.

కార్పోరేట్లకు అనుకూల విధానాలను కేంద్ర ప్రభుత్వం బరితెగించి తీసుకరావడం వల్ల వాళ్ల సంపద అనేక రెట్లు పెరిగిందన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే విధంగా శ్రామికుల శ్రమను దోచే విధంగా తయారుచేసి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి బ్రిటీష్ కాలంలోనే సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా విభజించడం సిగ్గుచేటన్నారు.

ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ 8 గంటల పని దినాన్ని అవహేళన చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని దినాన్ని అమలుచేస్తుందన్నారు. సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పిన కేంద్రం ప్రభుత్వం అమలుచేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకు, రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, రక్షణ తదితర రంగాలను ప్రయివేటు పరం చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు. దేశ ప్రజల సహజ సంపదను సంపన్న వర్గాలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.

నూతన పరిశ్రమను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల సంఖ్య మరింత పెంచిందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం వల్ల రవాణా ఛార్జీలు పెరగడంతోపాటు నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్నారు. ప్రజలపై భారం మోపి ప్రజలను దోపిడీ చేయడమే ప్రభుత్వ లక్షమా అని ప్రశ్నించారు.

కార్మిక చట్టాల పరిరక్షణకై, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుట కొరకై బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జక్కు రాజుగౌడ్, కార్మిక సంఘాల నాయకులు దర్ముల రామ్మూర్తి, మంచాల తిరుపతి, శంకర్, వేల్పుల సారంగపాణి, సంపత్, రవి, నాయిని రవి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News