నిజామాబాద్ బ్యూరో : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ మాట్లాడుతూ 202122 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు.
నీటి వినియోగం, సాగునీటి వనరులు తదితర వివరాలను గ్రామాలలో రైతుల ద్వారా సేకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీలోపు ఖచ్చితమైన వివరాలతో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వినియోగంతో అధికారిక సైట్‌లో అప్లోడ్ చేయాలని వ్యవసాయ విస్తీర్ణాధికారులకు సూచించారు.
జిల్లాలోని 450 రెవెన్యూ గ్రామాల్లో 108 మంది గణకులు, 28 మంది సూపర్‌వైజర్లు, 22 మంది మండల వ్యవసాయ అధికారులు, 25 మంది మండల గణాంక అధికారులు సర్వేలో పాల్గొంటారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అనంతరం వ్యవసాయ కమతాల గణన ఉద్దేశ్యాలను, సర్వే పాదాల నిర్వచనాలు అర్ధ గణాంక శాఖ, హైదరాబాద్ నుండి హాజరైన సహాయ సంచాలకులు శ్రీవల్లి, ఉప గణాంక అధికారులు సుధ, పులి రాజు వివరిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి డి. బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.