Monday, December 23, 2024

గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలి

- Advertisement -
- Advertisement -

టిఎస్‌పిఎస్సీ వద్ద అభ్యర్థుల ఆందోళన
పలువురుని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్:  గ్రూప్–2 పరీక్ష తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. పోలీసులు నిరసన వ్యక్తం చేసేందుకు సాయంత్రం 3 గంటల వరకు అనుమతిచ్చారు. సమయం ముగిసిన అభ్యర్థులు భైఠాయించడంతో పోలీసులు వారిని చెదరగొట్టి టిఎస్‌పిఎస్సీ పక్క ఉన్న మైదానం నుంచి వారి ఖాళీ చేయించారు. కొంతమంది సమీపంలోని మెట్రో స్టేషన్‌లోకి వెళ్లి నిరసన చేపట్టడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ట్రాఫిక్ స్థంభించడంతో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసుస్టేషన్‌కు తరలించారు. గురువారం నాంపల్లి టిజెఎస్ కార్యాలయం నుంచి వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు ర్యాలీగా బయలుదేరి కమిషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. అభ్యర్థులకు ఎన్‌ఎస్‌యూ, టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం, అద్దంకి దయాకర్‌తో పాటు వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు.

గ్రూప్-2 పరీక్షను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తుండటంతో టీఎస్ పీఎస్సీ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనిత రామచంద్రను కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. టిఎస్‌పిఎస్సీ చైర్మన్ విధుల్లో లేకపోవడంతో కార్యదర్శి కలిసి 48 గంటల సమయం అడిగామని ఏదో ఒక నిర్ణయం చెప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని గ్రూప్-2 అభ్యర్థులు పేర్కొన్నారు. కార్యాలయం పక్కన ఉన్న మైదానంలో అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారికి నిరసన తెలిపేందుకు మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా కొనసాగుతుందని వారు తెలిపారు. దీంతో పోలీసులు ధర్నా చేస్తున్న అభ్యర్థులపై స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో టిఎస్‌పిఎస్సీ పరిసరాలు ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు అవస్ధలు పడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఈనెల 29, 30న తలపెట్టిన గ్రూప్-2 వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2ని రీ షెడ్యూల్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు ప్రారంభమైన నుంచి 23వ తేదీ వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురుకుల, గ్రూప్-2 సిలబస్ వేర్వేరు కావటంతో రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇదేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ ఎకానమీలో గతంలోని సిలబస్ అదనంగా 70 శాతం కలిపారని చెబుతున్నారు. ఇటీవల పరీక్షల పేపర్లు లీకేజీ వ్యవహారంతో అభ్యర్థుల సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపాయని పలువురు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కొంత కాలం గ్రూప్-2ను వాయిదా వేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News