Friday, December 20, 2024

ఈశాన్య మంటలు మీ పుణ్యమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈశాన్య మంటలు మీ పుణ్యమేనంటూ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపైన,ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులుగా జరిగిన చర్చకు ప్రధాని మోడీ గురువారం సమాధానమిచ్చారు. దాదాపు 2.13 గంటల పాటు ప్రసంగించిన ప్రధాని తన ప్రసంగంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ నేతలపైన విమర్శలు గుప్పించడానికే కేటాయించారు. ఈశాన్యం అభివృద్ధిని కాంగ్రెస్ పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రధాని విమర్శించారు. ఈశాన్యం అభివృద్ధిని నెహ్రూ అడ్డుకుంటారని గతంలో రామ్ మనోహర్ లోహియా అన్నారని ఆయన గుర్తు చేశారు. 1966లో మిజోరాంలోని సామాన్యులపైనా దాడులు చేయించారు. ఇందిర హయాంలో మిజోరాంలో సామాన్యులపైన జరిగిన దాడులను ఇప్పటికీ దాచిపెట్టారు.1962 నాటి నెహ్రూ ప్రసంగం ఇప్పటికీ మిజోరాం ప్రజల మనసులను గుచ్చుకుంటూనే ఉంది. మార్చి 5ను మిజోరాం ఇప్పటికీ నిరసన దినంగానే పాటిస్తోందని మోడీ అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాకే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని చెప్పారు. రహదారులు, రైలుమార్గాలు, విమానాశ్రయాలతో ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారత్‌తో అనుసంధానం చేస్తున్నాం. ఈశాన్య భారతాన్ని ప్రపంచానికి దిక్సూచి చేస్తాం. మణిపూర్ అభివృద్ధికి ఎన్‌డిఎ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. మణిపూర్, నాగాలాండ్, మిజోరాంలలో అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోందని దుయ్యబట్టారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అందరూ సహకరిస్తే త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుందని మోడీ చెప్పారు. అయితే దాదాపు గంటన్నర ప్రసంగంలో ప్రధాని మోడీ మణిపూర్‌లో హింసాకాండ గురించి ఒక్క మాట కూడా మాట్లాడనందుకు నిరసనగా ‘ఇండియా’ కూటమికి చెందిన విపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేస్తూ వారు సభనుంచి వాకౌట్ చేస్తుండగా ప్రధాని మాట్లాడాలని పట్టుబట్టిన విపక్షాలకు తన ప్రసంగాన్ని వినే ఓపిక కూడా లేకపోయిందని మోడీ ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్, శిరోమణి అకాలీదళ్ సభ్యులు కూడా అనంతరం సభనుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభ మూజువాణీ ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించింది.

అవిశ్వాసం మాకు వరమే
విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసాలు ప్రవేశపెట్టి అభాసు పాలవుతున్నాయని ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ అన్నారు. వారి అవిశ్వాస తీర్మానాల వల ్లప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందంటూ చురకలు అంటించారు. ప్రతిపక్షాలకు ఆ భగవంతుడే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టమని చెప్పి ఉంటాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తమకు ఎప్పుడూ అదృష్టమేనని అన్నారు.‘ మేం మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకువచ్చాయి’ అని అన్నారు. 2018లోనూ అవిశ్వాసం పెట్టారని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వంపై ప్రజలు అనేక సార్లు విశ్వాసం చూపించారన్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ప్రతిపక్షాలు వరస నోబాల్స్ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్స్‌లు కొడుతోందని వ్యాఖ్యానించారు.

ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోను ఎన్‌డిఎప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.‘ అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుంది. ఇటీవల మా ప్రభుత్వం అనేక కీలక బిల్లులను సభలో ఆమోదించింది. వీటిపై ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఆసక్తి లేదు. విపక్షాలు దేశ ప్రజలపట్ల విశ్వాసఘాతుకానికి ఒడిగట్టాయి.పేదల గురించి వారికి ఆలోచన లేదు. అధికారంలోకి రావడమే వారి పరమావధి. విపక్షాలు మాట్లాడే ప్రతిమాటను దేశమంతా శ్రద్ధగా వింటోంది. ఇప్పటివరకు మీరు దేశాన్ని నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదు. విపక్ష నేతలు వారు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు’ అని ప్రధాని విమర్శలు గుప్పించారు. 1998లో శరద్ పవార్ నేతృత్వంలో, 2003, 2018లో సోనియాగాంధీ నేతృత్వంలోనూ అవిశ్వాసం పెట్టారని.. ఇన్ని సార్లు అవిశ్వాసాలతో వారు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు.

ప్రతిపక్షాల దుష్ప్రచారం
అవిశ్వాసం, అహంకారం ప్రతిపక్షాల నరనరాల్లో నిండుకు పోయిందని దుయ్యబట్టారు. భారత్‌ను అప్రతిష్ఠ పాలు చేయడానికి విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రయత్నించాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు యత్నించాయి. మేం దేశ ప్రతిష్ఠను ఖండాంతరాలకు వ్యాపింపజేశాం. స్కామ్‌లు లేని భారత్‌ను అందించాం. ఫలితంగానే భారత్‌పై ప్రపంచానికి నమ్మకం ఏర్పడింది.మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ సైతం ప్రశంసించింది.భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోందన్నారు.మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. 2028లో మీరు మరోసారి అవిశ్వాసాన్ని తీసుకువచ్చినప్పుడు ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా భారత్ ఉంటుందని దేశం విశ్వసిస్తోందంటూ ప్రధాని మోడీ విపక్షాలనుద్దేశించి ఎద్దేవా చేశారు.

అవినీతిలో కూరుకు పోయిన పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. తమ విధానాలతో దేశంకంటే పార్టీనే ముఖ్యమని కొన్ని పార్టీలు చాటి చెబుతున్నాయి. బహుశా వీరికి దేశంలోని పేదల ఆకలితో పట్టింపు లేదేమో. ఎందుకంటే వాళ్లకు అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయింది కాబట్టి అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. భారత్‌లో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయి. హెచ్‌ఎఎల్ దివాలా తీస్తోందని ప్రచారం చేశారు. అయితే హెచ్‌ఎఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది. అలాగే ఎల్‌ఐసి ప్రైవేటీకరణ చేస్తే నాశనమవుతుందని దివాలా తీస్తుందని ప్రచారం చేశారు. కానీ ఎల్‌ఐసి పటిష్ఠ స్థితిలో ఉందన్నారు.

కాంగ్రెస్‌పై నో కాన్ఫిడెన్స్
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేదు. ఆ పార్టీకి ఎలాంటి విజన్ లేదు. నిజాయితీ లేదు. అంతర్జాతీయ ఆర్థిక విధానం లేదు.కాంగ్రెస్ హయాంలో దేశం పేదరికంలో మగ్గిపోయింది. అందుకే రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా ఆ పార్టీని దూరం పెడుతున్నాయి. విపక్షాలకు పాకిస్థాన్‌పై ప్రేమ కనిపిస్తోంది. పాక్ చెప్పిందే ఆ పార్టీలు నమ్ముతున్నాయి.పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటే సైన్యాన్ని సైతం నమ్మలేదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎగతాళి చేశారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌పైనా విపక్షాలకు నమ్మకంలేకుండా పోయిందంటూ మండిపడ్డారు.లంకా దహనం జరిగింది హనుమాన్ వల్ల కాదు, రావణుడి అహంకారం వల్లే. ప్రజలు కూడా రాముడి లాంటి వాళ్లే. అందుకే 400నుంచి మిమ్మల్ని 40కి పడేశారంటూ కాంగ్రెస్ పార్టీపై నిశిత విమర్శలు చేశారు.

ఇండియా కూటమిపై సెటైర్లు
విపక్షాలు కొన్ని రోజలు క్రితం బెంగళేరులో యుపిఎకు అంత్యక్రియలు జరిపాయి.ఇన్ని తరాలు గడిచినా పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి తేడా తెలియని రీతిలో ఉంది మీ తీరు. విపక్షాలు చివరికి ఇండియాను ఐ.ఎన్.డి.ఐ.ఎగా ముక్కలు చేశాయి. తమను తాము బతికించుకోవడానికి తిరిగి ఎన్‌డిఎ తీసుకోవలసిన పరిస్థితి వారిది. ఎన్‌డిఎలో రెండు ‘ఐ’లను చేర్చారు. మొదటి ఐ 26 పార్టీల అహంకారం. రెండో ‘ఐ’ ఒక కుటుంబం అహంకారానికి నిదర్శనం. అలవాటు లేని నేను(ఐ)వారిని వదలడం లేదు. ఈ క్రమంలోనే ఎన్‌డిఎను కూడా దోచుకున్నారు’ అని కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమిపై సెటైర్లు విసిరారు.
మణిపూర్‌లో శాంతికి నాదీ హామీ
మణిపూర్‌లో జరిగిన హింసాకాండ దిగ్భ్రాంతికరమనడంలో సందేహం లేదు. హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో పరిస్థితులు మారిపోయాయి. అయితే రాబోయే కాలంలో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని నేను అక్కడి ప్రజలకు ఇస్తున్నాను. నిందితులకు కఠిన విక్షలు పడేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అన్ని విధాల కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంటే ఉందని అక్కడి ఆడపడుచులకు, బిడ్డలకు నేను చెప్పాలనుకుంటున్నా.‘ యావత్ దేశం మీ వెంట ఉందమ్మా. మణిపూర్ త్వరలో ప్రగతి పథాన పయనిస్తుంది. మణిపూర్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని ప్రధాని ఆ రాష్ట్ర ప్రజలకు దేశప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News