న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుత వడ్డీ రేటు 6.50 శాతమే కొనసాగనుంది. అయితే ఆహార ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రిజర్వు బ్యాంక్ సంకేతాలు ఇచ్చింది. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రకటించారు. 202324 ద్రవ్యోల్బణం అంచనాను ఆర్‌బిఐ 5.1 శాతం నుండి 5.4 శాతానికి పెంచింది. పెరుగుతున్న కూరగాయల ధరల కారణంగా జులై, ఆగస్టు నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు.
అదే సమయంలో 202324లో వాస్తవ జిడిపి వృద్ధి అంచనా 6.5 శాతం నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 6 సార్లు మొత్తంగా 2.50 శాతం పెంచారు. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ్య విధాన సమావేశం జరుగుతుంది. రెపో రేటులో మార్పు లేనందున రుణాలు ఖరీదైనవి కావు, ఇఎంఐ కూడా పెరగదు. 202425 క్యూ1లో జిడిపి అంచనా 6.6 శాతంగా ఉంటుందని, అదే సమయంలో ఆర్థిక సంవత్సరం 2023-24కి వాస్తవ జిడిపి వృద్ధి అంచనా 6.5 శాతమని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇతర దేశాల కంటే భారత్‌కు ఎక్కువ సామర్థ్యం ఉందని ఆర్‌బిఐ గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణంపై ఆందోళన, అనిశ్చితి ఇప్పటికీ అలాగే ఉందన్నారు. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతానికి పెరిగింది. టమోటాలు, ఇతర కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని గవర్నర్ తెలిపారు.