Monday, December 23, 2024

ఇండిగో తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

1859లో ప్రారంభమైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్ బిద్రోహో 1860 వరకు ఒక సంవత్సరం పాటు బెంగాల్‌లో జరిగింది. వాణిజ్యం పేరుతో భారత్‌లోకి అడుగిడి ఆ తరువాత రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న బ్రిటిష్ వలసవాదులు ఎన్నో రకాలు గా మన దేశ సంపదను కొల్లగొట్టారు. రైతులకు అత్యంత ప్రతికూలమైన నిబంధనల ప్రకారం నీలిమందును పండించమని బలవంతం చేసిన బ్రిటిష్ ప్లాంటర్లపై రైతులు చేసిన తిరుగుబాటే ఇండిగో తిరుగుబాటు లేదా నీలి విప్లవం.డా హీరాలాల్ చౌధురి, అరుణ్ కృష్ణన్నన్ లను నీలి విప్లవ పితామహులుగా పిలుస్తారు. నీలిమందు ఒక పుష్పించే మొక్క. నీలిమందు మొక్క ఆకులను నీటిలో నానబెట్టినప్పుడు వాటి నుండి నాణ్యమైన నీలం రంగు ఉత్పత్తి అవుతుంది. ఆ రంగును వస్త్ర పరిశ్రమలో వివిధ రకాల వస్త్రాలకు, ప్రత్యేకించి డెనిమ్ వస్త్రాలకు రంగుగా ఉపయోగిస్తారు. ఉష్ణమండల వాతావరణం మొక్కల పెరుగుదలకు అత్యంత అనుకూలమైనది.క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా నీలిమందుసాగు ఐరోపా దేశాలలో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. తక్కువ సాగు, అధిక డిమాండ్ కారణంగా, ఇండిగో ధర చాలా ఎక్కువగా ఉండి వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండేది. భారతదేశంలో ఇండిగోను ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో సాగు చేస్తారు.

13వ శతాబ్దం నాటికి, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో బట్టల తయారీకి భారతీయ నీలిమందు విరివిగా ఉపయోగించబడేది.కాగా భారతీయ ఇండిగో చాలా తక్కువ పరిమాణంలో యూరోపియన్ మార్కెట్‌లకు చేరడంతో దాని ధర చాలా ఎక్కువగా ఉండేది. దీంతో ఫ్రెంచ్ వారు బ్రెజిల్‌లోని కరీబియన్ దీవులలోని సెయింట్ డొమింగ్యూలో ఇండిగోను సాగు చేయడం ప్రారంభించారు. ఉత్తర అమెరికాలో పెద్ద సంఖ్యలో ఇండిగో తోటలు ఏర్పాటు చేయబడ్డాయి. భారత్‌లో ఇండిగో తోటల పెంపకం మొదట 1777 సంవత్సరంలో బ్రిటన్ దేశస్థుడు లూయిస్ బొన్నాడ్ చేత బెంగాల్‌లోని నాడియా, పాబ్నా, రంగ్‌పూర్ జిల్లాలు మరియు హుగ్లీ సమీపంలోని సల్దానాలో ప్రారంభించబడింది.నీలిమందు పంటల భారీ లాభదాయకతను చూసిన తర్వాత రైతులు ఆ పంటపై మొగ్గు చూపడంతో నీలిమందు సాగు విస్తీర్ణం పెరిగింది. నవాబులు ఈస్టిండియా కంపెనీ ఆధీనంలో ఉండడం, ఇతర రాజకీయ పరిస్థితుల కారణంగా 1788లో బ్రిటన్ దేశపు మొత్తం ఇండిగో డిమాండ్‌లో 30 శాతం భారతదేశం నుండి దిగుమతి అయ్యేది. ఇది క్రమంగా పెరుగుతూ 1810 నాటికి 95 శాతానికి పెరిగింది. పారిశ్రామిక విప్లవం ఉధృతంగా కొనసాగుతున్న 18వ శతాబ్దాంతంలో బ్రిటిష్ పత్తి, వస్త్ర పరిశ్రమ అనూహ్యంగా విస్తరించడంతో నీలిమందుకు అధిక డిమాం డ్ ఏర్పడింది. 18వ శతాబ్దంలో ఐరోపా దేశాలలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇండిగో ఉత్పత్తి కూడా అంతే వేగంగా పెరిగింది. భారత్ లో సమశీతోష్ణ పరిస్థితుల కారణంగా ఇండిగో సాగుకు అత్యంత అనుకూలంగా ఉండడంతో సహజంగానే అది బ్రిటిష్ వారి దృష్టిని ఆకర్షించింది.

ఇండిగోను సాధారణంగా ‘నిజ్’ (Nij), ‘ర్యోతి’ (Ryoti) అనే రెండు పద్ధతులలో సాగు చేసేవారు. నిజ్ వ్యవస్థలో రైతులు తమ స్వంత భూమి లేదా జమీందార్ల వద్ద నుండి కౌలుకు తీసుకున్న భూమిలో సాగు చేసేవారు.నీలిమందు సాగు శ్రమతో కూడుకున్నది కావడం, పోషక విలువలు గల భూమి అవసరం ఉండడం చేత భారీ సంఖ్యలో కూలీలు, అధిక విస్తీర్ణంలో సారవంతమైన భూమి అవసరమయ్యేది. అయితే బెంగాల్‌లో పెద్ద ఎత్తున వరి సాగు చేయడం వల్ల కూలీల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. అంతేకాక, అధిక విస్తీర్ణంలో నిజ్ పద్ధతిలో సాగు చేయడానికి ఎక్కువ సంఖ్యలో ఎద్దులు, నాగళ్లు, అధిక పెట్టుబడి అవసరం కావడం సమస్యలుగా మారడంతో ఈ విధానంలో నీలిమందు సాగుకు వినియోగించే భూమి మొత్తం భూమిలో 25 శాతానికి మాత్రమే పరిమితమయ్యేది. ‘ర్యోతి’ విధానంలో సాధారణంగా ఇండిగో ఉత్పత్తి కొనుగోలుదారు (Planter), రైతుల (Ryot) మధ్య ఏర్పాటు చేసుకొనే ఒప్పందం ప్రకారం నీలిమందు సాగు జరిగేది. గ్రామపెద్దలు రైతుల పక్షాన ఒప్పంద పత్రాలపై సంతకం చేసేవారు. ఒప్పందం ప్రకారం, ప్లాంటర్లు రైతులకు ముందస్తు వడ్డీతో కూడిన బయానా చెల్లించేవారు. సాధారణ మార్కెట్‌తో పోలిస్తే ఈ ముందస్తు బయానాపై వడ్డీ రేటు తక్కువగా ఉండేది. అయితే రైతులు తమ వద్ద ఉన్న భూమిలో కనీసం 25 శాతం భూమిలో నీలిమందు సాగు చేయాలన్న షరతును ప్లాంటర్లు విధించేవారు. సాగుకు అవసరమైన అన్ని పరికరాలు, సామాగ్రిని వారు అందించగా నాట్లు, కోత వంటి మిగిలిన పనులు రైతులు చేపట్టేవారు. మొత్తం ఇండిగో ఉత్పత్తిలో 75 శాతం ఈ పద్ధతి ద్వారానే సాగయ్యేది.

యూరోపియన్ ప్లాంటర్లు తమ స్వీయ లాభాపేక్ష కోసం భారతీయ రైతులను వత్తిడికి గురిచేసేవారు. స్థానిక భూస్వాములు, జమీందార్లను వివిధ రకాలుగా ప్రలోభ పెట్టి రైతుల ద్వారా ఇండిగో సాగు చేయించేవారు. వారు జమీందార్ల నుండి తాత్కాలిక, శాశ్వత, దీర్ఘకాలిక ఒప్పంద ప్రాతిపదికన భూములను దక్కించుకోవడంతో పాటు పోరంబోకు భూములను హస్తగతం చేసుకుని జమీందారీ హక్కులను సైతం పొంది భారతీయ రైతుల ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఇండిగో సాగు చేయించేవారు. ఇందుకు వారు రైతులకు డాడోన్ అనే రుణాలు ఇచ్చేవారు. రైతులు ఆ రుణాలను తిరిగి చెల్లించలేక జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పాటు తమ కుటుంబంలోని తరువాతి తరాలను సైతం బానిసలుగా కుదుర్చాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడేవి. రైతులు ఇండిగో సాగుకు నిరాకరిస్తే బ్రిటిష్ ప్లాంటర్లు వారిని రుణాల తాకట్టు కింద బానిసలుగా మార్చడం, కిడ్నాప్ చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడగా, బ్రిటిష్ వలసవాద చట్టాలు కూడా వారికి అనుకూలంగా ఉండడం, జమీందార్లు కూడా వారికి వత్తాసు పలకడం భారతీయ రైతులను మరిన్ని ఇక్కట్లకు గురిచేసేవి. ఇండిగోను నిరంతరం సాగు చేయడం వల్ల నేల లోని సహజ పోషకాలు క్రమక్రమంగా క్షీణించడంతో ఆ నేలలు వరి సాగుకు ప్రతికూలంగా మారేవి. అలా ఇండిగో సాగు వరి సాగుకు ప్రతిబంధకంగా మారడం రైతులలో నిరసన జ్వాలలకు తెరలేపి అది క్రమంగా నీలి విప్లవానికి ఆజ్యం పోసింది.
1859లో నదియా జిల్లా, కృష్ణానగర్ సమీపంలోని చౌగాచా గ్రామంలో నీలి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంగాల్‌లో మొదట బిష్ణుచరణ్ బిస్వాస్, దిగంబర్ బిస్వాస్‌లు ప్లాంటర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. క్రమంగా అది ముర్షిదాబాద్, బీర్భూమ్, బుర్ద్వాన్, పాబ్నా, ఖుల్నా, జెస్సోర్‌లకు దావానలంలా వ్యాపించింది. విప్లవ బాట పట్టిన తిరుగుబాటుదారులు ఇండిగో డిపోలను తగులబెట్టడంతో వారి పై విచారణ చేపట్టిన బ్రిటిష్ పాలకులు కొందరు విప్లవకారులను బహిరంగంగా ఉరి తీశారు. ఈ అరాచకాన్ని అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. ఈ తిరుగుబాటులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కుండలు పగులకొట్టడం, టపాసులు పేల్చడం ద్వారా తమ నిరసనను తెలిపారు. ఈ తిరుగుబాటు ముఖ్యంగా 1860లో పాబ్నా జిల్లాలో ఉధృతంగా కొనసాగింది. పాబ్నా, నదియా జిల్లాల్లోని బరాసత్ డివిజన్‌లోని రైతులందరూ పెద్ద ఎత్తున సమ్మెకు దిగి నీలిమందు సాగును తీవ్రంగా ప్రతిఘటించారు.
నదియాకు చెందిన బిశ్వాస్ సోదరులు, మాల్దాకు చెందిన రఫీక్ మొండెల్, పబ్నాకు చెందిన ఖాదర్ మోల్లా నేతృత్వంలో విప్లవకారులు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారు.

బెంగాల్, కథ్ గరా ప్రాంతాలలో పెద్ద మొత్తంలో నీలిమందు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నీలిమందు తోటల పెంపకందారులు పాల్పడగా బ్రిటిష్ వలస పాలకులు కిరాయి దళాలతో వారిని బలవంతంగా అణిచివేసారు. ఇండిగో ప్లాంటర్లతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘించినందుకు వందలాది రైతులపై కోర్టులలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నీలిమందు తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వంపై శక్తివంతమైన ప్రభావం చూపడంతో మార్చ్ 1860లో ఇండిగో కమిషన్ తక్షణ ఏర్పాటుకు దారితీసింది. నీలిమందు ఒప్పందాలను అమలు చేయడానికి చట్టాన్ని ఆమోదించడంతో పాటు ఇండిగో సాగు సమస్యపై విచారణ చేపట్టాల్సిందిగా కమిషన్‌ను ఆదేశించడంతో, కమిషన్ ఆగష్టు 1860లో సమర్పించిన తన నివేదికలో నీలిమందు సాగు పద్ధతులను తీవ్రంగా విమర్చించడం గమనార్హం.ఇండిగో కమిషన్ సిఫార్సుల ఆధారంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్ 1860 లో రైతులను నీలిమందు సాగు చేయమని బలవంతపెట్టలేమని, అన్ని వివాదాలను చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించేలా చూస్తామని నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదేమైనప్పటికీ నీలిమందు ప్లాంటర్లు అప్పటికే తమ కర్మాగారాలను మూసివేయడంతో 1860 చివరి నాటికి బెంగాల్ నుండి నీలిమందు సాగు పూర్తిగా కనుమరుగయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News