గద్వాల ప్రతినిధి: పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని జడ్పీ నివాసంలో మల్దకల్ ఉపసర్పంచ్ సికీలా మల్దకల్, వార్డు మెంబర్ చిన్న కిష్టన్న, మాజీ వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గూడెందొడ్డి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు జడ్పీ చైర్‌పర్సన్ సరిత సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మళ్లీ అధికారంలోకి రావడానికి బిఆర్‌ఎస్ పార్టీ ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసిన వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీలను కూడా పూర్తిగా అమలు చేయలదేన్నారు. గ్రామాలలో అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లులేని ప్రతి పేదవానికి ఇళ్లు కట్టిస్తామన్నారు. రూ.4వేలు పింఛన్ అందే విధంగా అమలు చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.