నాగర్‌కర్నూల్ : మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని నాగర్‌కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేతివృత్తులు, శ్రమజీవులు గాజుల వెంకట్ స్వామి, టైలర్ మోహన్, మహిళలతో కలిసి ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన బహుజన బావుట దీర్ఘకావ్యం పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రజల సాహిత్యము చేరాలనే ఉద్దేశంతో బడుగుల విద్యకై, సామాజిక దురాచారాలు, కుల నిర్మూలనకై జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనతో పాటు మహిళా వికాసానికి అవిశ్రాంత పోరాటం చేసిన మన మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలిపారు.
అణగారిన వర్గాల అభివృద్ధికి విద్యనే మూలమని మహిళా విద్యకు, బడుగుల విద్యకై తొలి చదువుల జ్యోతిని వెలిగించిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు మనకు ఆరాద్యనీయులని అన్నారు. బహుజన తాత్వికుడు, సత్యశోధకుడు మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత పోరాటాలపై వచ్చిన దీర్ఘ కావ్యాన్ని రచించిన కవి వనపట్ల సుబ్బయ్యను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ బాబు రావు, బిఆర్‌ఎస్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, మన్నెపు రెడ్డి, భాస్కర్ గౌడ్, సుబ్బారెడ్డి, కవులు డి.రాములు, వహీద్ ఖాన్, మహమ్మద్ ఖాజ, సీనియర్ జర్నలిస్టు కందికొండ మోహన్, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.