Monday, December 23, 2024

తెలంగాణలో తగ్గిన పేదరికం

- Advertisement -
- Advertisement -

వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్- 2 ను ఇటీవల విడుదల చేసింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, సూలుకు వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంట గ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నది. 2015- 16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- 4తో పాటు 2019 -21లో నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక సూచీలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 2015-16, 2019 మధ్యకాలంలో బహుమితీయ పేదల సంఖ్య 24.85 శాతం నుండి 14. 96 శాతానికి బాగా క్షీణించినందున, ఐదేళ్లలో 13.5 కోట్ల మందికి పైగా భారతీయులు బహుమితీయ పేదరికం నుండి తప్పించుకున్నారని తెలిపింది. ఆయోగ్ నివేదిక విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023 అనే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుండి 19.28 శాతానికి వేగంగా క్షీణించింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3.43 కోట్ల క్షీణత నమోదైందని ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లు ఉన్నాయని, పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదల, పాఠశాల విద్య, పారిశుద్ధ్యం, వంట ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషించాయని, పేదరికాన్ని తగ్గించడానికి దారితీసిన మొత్తం 12 సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.

ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని నీతి ఆయోగ్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్- 2023లో నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015- 16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019- 21 నాటికే 5.88 శాతం దిగువకు తగ్గడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గింది. రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్ 33.75 శాతం పేదలతో మొదటి స్థానంలో, జార్ఖండ్ (28.81 శాతం), మేఘాలయ (27.79 శాతం), ఉత్తరప్రదేశ్ (22.93 శాతం), మధ్యప్రదేశ్ (20.63 శాతం) రెండో స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 3.34 కోట్ల మంది పేదరికానికి దూరమయ్యారని, ఆ తర్వాత స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్ ఉండగా, తెలంగాణలో 27,61,201 మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలోపే 7.3 శాతం మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించడం లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు కూడా దోహదపడ్డాయని విశ్లేషకుల అభిప్రాయం.ఐదేళ్ళలో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ తర్వాత పేదరికం ఉన్న రాష్ట్రం గా తెలంగాణ ఉండడటం మంచి పరిణామం. రాష్ట్ర ప్రజలపై పేదరికం ప్రభావం 40.85 శాతం ఉందని, రాష్ట్రంలోని పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజలలోనే పేదరికం ఎక్కువగా ఉందని తేల్చారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 7.51 శాతం మంది పేదరికంలో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 2.73 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు తేలింది. అయితే, 2015- 16తో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది, తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పేదరిక తగ్గుముఖంలో కృషి చేసింది.

జిల్లాల వారీగా చూస్తే పేదరికంలో ఆసిఫాబాద్ జిల్లా మొదటి స్థానంలో, గద్వాల రెండో స్థానంలో, ఆదిలాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. 39 శాతం వంట ఇంధనం లేకపోవడం, 24.41 శాతం పారిశుద్ధ్య లోపం, 3.36 శాతం తాగునీటి కొరత.
రాష్ట్రంలో 20.49 శాతం మందికి ఇళ్లు లేవని, 8.51 శాతం మందికి ఆస్తులు లేవని, 2.74 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవని నివేదిక వెల్లడించింది.ప్రజల జీవన ప్రమాణాల పెంపుకి దోహదపడే పలు అంశాలను ప్రభావితం చేసే ప్రధాన తెలంగాణ పథకాలు కూడా పేదరికాన్ని తగ్గించడంలో దోహదపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, కెసిఆర్ కిట్, ఆరోగ్య శ్రీ, గురుకులాల్లో ఎక్కువ విద్యార్ధుల నమోదు, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛ తాగు నీటి సరఫరా, పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాల, నగర ప్రాంతాల పారిశుద్ధ్య కార్యక్రమాలు, సామజిక భద్రత కోసం ప్రభుత్వం ఇస్తున్న పలు పింఛన్లు, దళిత బంధు లాంటి ప్రభుత్వ పథకాలు,

కార్యక్రమాలు కూడా తెలంగాణ పేదరికం తగ్గడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు. అదే విధంగా దేశంలో నేడు తెలంగాణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా సహకరించే దేశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏడో స్థానం లో ఉండగా, తెలంగాణ సగటు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 8.6 శాతం నమోదు చేసింది. ఇది దేశంలోనే మూడవ అత్యధికం. తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. పూర్తి స్థాయిలో పేదరికాన్ని తగ్గించడంలో తెలంగాణ ఎదగాలంటే దేశంలో ఆర్ధిక వ్యవస్థలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. మిగతా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఐదేళ్ళలో పేదరిక శాతం తగ్గి, నేడు జాతీయ స్థాయిలో తొమ్మిదేళ్ళ తెలంగాణ, చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని నేటి గణాంకాలే చెప్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News