సగర్ ( మధ్యప్రదేశ్) : గత ప్రభుత్వాలు దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులను నిర్లక్షం చేశాయని, కేవలం ఎన్నికల సమయం లోనే గుర్తుంచుకునేవని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాం లోనే వారికి గౌరవం అందుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దళిత బస్తీలు, వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ఏరియాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు నిర్లక్షం చేయగా, ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా పైపుల ద్వారా మంచినీరు లభిస్తోందని మోడీ వివరించారు.
సగర్ జిల్లా ధనలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. బడ్‌తుమా గ్రామంలో రూ. 100 కోట్లతో నిర్మాణం కానున్న సంఘసంస్కర్త, ఆధ్యాత్మిక కవి సంత్ రవిదాస్ ఆలయం, స్మారక మందిరానికి ఆయన శంకుస్థాపన చేశారు. ధనలో బినకోట రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమేకాక, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనేక రోడ్ ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. సంత్ రవిదాస్ స్మారక ప్రాజెక్టులో భాగంగా 300 నదుల నుంచి వేలాది గ్రామాలకు మంచినీరు లభిస్తుందని చెప్పారు.