కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలుగుబంటి శనివారం ఉదయం ద్వారకానగర్ కాలనీలో సంచరిస్తున్నట్లు కాలనీవాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది సహాయంతో దాదాపు ఉదయం నుంచి ఒంటిగంట వరకు చెట్ల పొదలలో దాగి ఉన్న ఎలుగుబంటిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.
అంతేకాకుండా ఇండ్లలో నుంచి ప్రజలను బయటకు రాకుండా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ తరువాత వన్యప్రాణుల రెస్క్యూ టీం అధికారులు సిబ్బందితో ఎలుగుబంటిని వెంటాడి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత ఎలుగుబంటి మత్తులోకి జారుకున్నాక సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్‌కు సహకరించిన అటవీశాఖ ఉన్నత అధికారులు, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ సిబ్బందికి, డివిజన్ యువకులకు కృతజ్ఞతల తెలిపారు..