ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్ష రద్దు
న్యూఢిల్లీ : దేశం లోని ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు తరచుగా జరుగుతుండడానికి వ్యక్తిగత సమస్యలతోపాటు పరీక్షల ఒత్తిడి కూడా కారణమవుతోందన్న వాదనల నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షల భారాన్ని తగ్గించడానికి పరీక్ష విధానంలో మార్పులు చేపట్టింది . ఈ క్రమం లోనే ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్టు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ వెల్లడించారు. ఇదివరకు ఒక సెమిస్టర్‌లో రెండు సెట్ల పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్‌తోపాటు క్విజ్, అసైన్ మెంట్స్ వంటి మూల్యాంకనాలు ఉండేవి. దీంతో పరీక్షల క్యాలెండర్ అతిగా నిండిపోయింది.
Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్
ఈ నేపథ్యంలో విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. అంతర్గత సర్వే నిర్వహించి ఫ్యాకల్టీ, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ఈమేరకు ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్షను తొలగించాలని నిర్ణయించామని తెలిపారు. మిగతా వన్నీ యథాతధంగా ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న సెమిస్టర్ నుంచే ఇది అమల్లోకి వస్తుంది అని ఓ వార్తాసంస్థ ఇంటర్వూలో రంగన్ బెనర్జీ వివరించారు. ఆత్మహత్యల నివారణకు గాను విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందేలా కౌన్సెలింగ్ అందించడం, మెంటార్‌లను నియమించడం వంటి చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాదిలోఐఐటీల్లో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఫిబ్రవరిలో ఐఐటి మద్రాస్‌లో ఒకరు, ఐఐటి బాంబేలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. మార్చిలో ఐఐటీ మద్రాస్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి, ఏప్రిల్‌లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత నెలలో ఐఐటీ ఢిల్లీలో బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.