హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మన రాష్ట్రంలో అందుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరే ఏ రాష్ట్రంలో అందడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ శిక్షణా శిబిరంలో ప్రభుత్వ విప్ అండ్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, దాసోజు శ్రావణ్‌లు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వినియోగం, ప్రతిపక్షాల అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టడం, సోషల్ మీడియా బలోపేతం తదితర అంశాలపై వారియర్స్‌కి వారు దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీకి రైతులే వెన్నెముక అన్నారు. తెలంగాణ రైతాంగ మొత్తం కెసిఆర్ వెంట నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని, ధరణిని ఎత్తేస్తామని రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటురన్నారు.
3 గంటల కాంగ్రెస్ కావాలా, 24 గంటల బిఆర్‌ఎస్ కావాలా…
మూడు గంటల కాంగ్రెస్ కావాలా, 24 గంటల బిఆర్‌ఎస్ కావాలో రైతులు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకుల తయారవుతుందన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ఆరోపణలు, విష ప్రచారాలను వ్యక్తిగతంగా కాకుండా విశ్లేషణాత్మకంగా త్రిప్పికొట్టాలని ఆయన సూచించారు. రానున్న పది రోజుల్లో నియోజకవర్గంలో గ్రామ, మండల, మున్సిపాలిటీ వార్డుల వారీగా సోషల్ మీడియా కమిటీలను నియమిస్తామన్నారు. సోషల్ మీడియా వారియర్స్ ప్రణాళిక బద్ధంగా పనిచేస్తూ సోషల్ మీడియా బాధ్యతలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.
సమన్వయంతో ముందుకు వెళ్లాలి
అభివృద్ధి, సంక్షేమ వివరాలను అన్ని సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా చేరవేయాలని బాల్క సుమన్ సూచించారు. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, ఎవరిని రెచ్చగొట్టే విధంగా దూషించవద్దన్నారు. యువకులుగా, విద్యావంతులుగా బిఆర్‌ఎస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టాలన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వీడియోల రూపంలో, కంటెంట్ రూపంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే క్రమంలో నాయకులను, ప్రజా ప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈనెల చివరి వారంలో నియోజకవర్గంలోని 5,000 మంది సోషల్ మీడియా వారియర్స్‌కు శిక్షణ అందిస్తామన్నారు. ఈ సమావేశంలో సత్యప్రసాద్, రవీందర్, విజయానంద్, నియోజకవర్గానికి చెందిన సుమారు 500 మంది వారియర్స్ పాల్గొన్నారు.