వచ్చే నెల 8న నిర్వహిస్తాం : క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్
అధికారులు, శాట్స్ ఛైర్మన్‌తో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ : బుక్ మై షో లైవ్ ప్రొడక్షన్‌లో భాగంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో తొలిసారిగా సెప్టెంబర్ 8న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ క్రీడల వాల్ పోస్టర్‌ను రాష్ట్ర మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర క్రీడా శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ లోగోను ఆవిష్కరించారు. దేశంలోనే రెండోసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయంగా పేరున్న 28 మంది డబ్య్లుడబ్ల్యుఈ క్రీడాకారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించిన క్రీడాకారులు ఫ్రీకిన్ రోలెన్స్ , ఉమెన్ వరల్డ్ ఛాంపియన్ రేయ రిప్లై , కెవిన్, సమి జైన్, ఓవెన్స్‌లతోపాటు ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ సాధించిన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్లు అయిన ది రింగ్ జనరల్ గన్థర్, ఎస్. జిండర్ మహల్ , వీర్ సంగ, డ్రూ మింటైర్, బెక్కీ లించ్, నటాల్యా, మాట్ రిడ్డు, లుడ్విగ్ కైజర్ తదితరులు పాల్గొంటారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. క్రీడాకారులు డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్స్ క్రీడల్లో తమ సొంత గడ్డపై వారి అసమానమైన నైపుణ్యాలు, తమ పరాక్రమాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ క్రీడలు యావత్ భారతీయ అభిమానులకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు. మరింత సమాచారం కోసం www.wwe.comను సంప్రదించవచ్చని మంత్రి తెలియజేశారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో బుక్ మై షో లైవ్ నిర్వాహకులు హరీష్ రెడ్డితో పాటు క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు.