Sunday, November 24, 2024

మణిపూర్ హింసాకాండ..సిబిఐ దర్యాప్తుకు మరో 9 కేసులు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో 9 కేసులను సీబీఐ చేపట్టింది. దీంతో సిబిఐ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే సిబిఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం కాబోదని ఉన్నతాధికారులు వెల్లడించారు. మహిళలపై నేరాలు, లైంగిక దాడులకు సంబంధించిన ఎలాంటి కేసులు వెలుగు లోకి వచ్చినా సీబీఐ వాటిని పరిగణన లోకి తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన రెండు కేసులతోసహా మొత్తం ఎనిమిది కేసులు సిబిఐ దర్యాప్తులో ఉన్నాయి. చురాచంద్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న మరో లైంగిక వేధింపుల కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం లోని రెండు జాతుల మధ్య ఘర్షణల నేపథ్యంలో అధికారులపై కూడా వర్గ ముద్ర పడుతోంది.

దాంతో ఎలాంటి పక్షపాత ఆరోపణలకు తావు లేకుండా మణిపూర్‌లో తమ కార్యకలాపాలు కొనసాగించడం సీబీఐకి పెను సవాలుగా మారింది. అందుకే మణిపూర్ రాష్ట్ర అధికారుల ఎంపికలో సిబిఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీబీఐ విచారిస్తున్న చాలా కేసులు షెడ్యూల్ కులాలు, తెగల చట్టానికి సంబంధించినవి. వీటిని డీఎస్పీ స్థాయి అధికారి విచారిస్తారు. అలా కుదరని పక్షంలో సీబీఐ ఎస్పీలు ఈ కేసులను పర్యవేక్షించే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో సీబీఐ సేకరిస్తున్న అన్ని రకాల ఫోరెన్సిక్ శాంపిళ్లను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి పంపిస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి సీబీఐ మహిళా అధికారులను నియమించింది. బాధితుల స్టేట్‌మెంట్ నమోదు చేయడం , అనుమానితులను ప్రశ్నించడం తదితర విషయాల్లో వారి సేవలను వినియోగించుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News