న్యూఢిల్లీ : సామాజిక పరంగా ప్రజల్లో చీలికలు తీసుకువచ్చి దేశాన్ని అస్థిరపరిచేందుకు పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పన్నుతున్న కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) భగ్నం చేస్తోంది. ఈమేరకు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఐదు రాష్ట్రాల్లో ఆదివారం దాడులు సాగించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అనేక డిజిటల్ సాధనాలతోపాటు నేరపూరిత సమాచారం ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేరళ లోని కన్నూర్, మలప్పురం జిల్లాలు,
కర్ణాటకలో దక్షిణ్ కన్నడ, మహారాష్ట్రలో నాసిక్, కొత్తపూర్, పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్,బీహార్ లోని కథియార్ జిల్లాలో ఈ దాడులు సాగాయి. దేశంలో 2047నాటికి ఉగ్రవాదం, హింసాకాండ ద్వారా ఇస్లా రాజ్యాన్ని విస్తరింప చేయడానికి పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఆర్మీని విస్తరింప చేయాలన్నదే పిఎఫ్‌ఐ లక్షం. ఈమేరకు యువతను ఆకర్షించి వారికి ఆయుధ శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఎ గత కొన్ని నెలలుగా వివిధ రాష్ట్రాల్లో దాడులు చేపట్టి ఈ కేడర్‌ను, నిర్వాహకులను అరెస్టు చేస్తోంది. గత మార్చిలో ఈ సంస్థకు సంబంధించి 19 మందిని అదుపు లోకి తీసుకుని ఛార్జిషీట్ దాఖలు చేసింది.