Monday, December 23, 2024

పిల్లల వికాసానికి బాల కథా సౌరభం

- Advertisement -
- Advertisement -

నేడు బాలల కోసం పెద్దలు రాసిన పుస్తకాలే కాకుండా పిల్లలు తమకోసం రాసిన అనేక పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు బాలసాహిత్యం రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బాల సాహిత్యానికి పెద్ద పీట వేయబడింది. హైదరాబాదులో నిర్వహించిన తెలుగు మహాసభలలో బాల సాహిత్యం జయహో అన్నంతగా కొనసాగింది. అనేకమంది బాలల కథా రచయితలు శరవేగంగా కథలు, గేయాలు వంటి మొదలగు ప్రక్రియలలో అనేక పుస్తకాలు రాస్తున్నారు. ఇవాళ బాల సాహిత్యం అనుకున్నంత విధంగా అందుబాటులో ఉంది. కాకపోతే విద్యార్థులకు కొంత చేరువలో లేదని అభిప్రాయం కూడా ఉంది. అనేక పాఠశాలల్లో బాలసభలు, బాల కవి సమ్మేళనాలు జరుగుతుండడం గొప్ప పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే బాల సాహిత్యం మూడు పూలు ఆరు కాయలు వర్ధిల్లుతుందని చెప్పవచ్చు.

అయినా కూడా మెరుగైన సమాజం కోసం బాల సాహిత్యం పై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సి న అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 1943లో ఏర్పడిన నాటి నుంచి ఆవిరళం గా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంది . సమాజ వికాసానికి ముఖ్యంగా బాలల సర్వతోముఖాభివృద్ధికి దోహాదపడే సాహిత్యాన్ని రూపొందిస్తుంది. భాషా సాహిత్య వికాసంలో బాల సాహిత్యం ఒక పునాది లాంటిది. ఆ దృష్టితోనే బాల సాహిత్య సమ్మేళనం ఇటీవల కాలంలో మే 24, 25 రెండు రోజులపాటు నిర్వహించింది. రెండు తెలుగు ప్రాంతాల నుండి అనేకమంది బాలసాహితీ వేత్త లు, భాషాభిమానులు, బాల రచయితలు పాల్గొనడం జరిగింది.అందులో భాగంగానే బాల సాహిత్య వికాసానికి సంబంధించి బాలల మూర్తిమత్వానికి దోహదపడే ‘బాల కథా సౌరభం’ అనే బాలల పుస్తకాన్ని బాల సాహిత్య సమ్మేళనంలో శాసన మండలి సభ్యులు, ప్రముఖ ఉద్యమకారుడు, గాయకుడు దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈనెల 24న తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆవిష్కరించింది.

బాల సాహిత్యానికి సంబంధించి ఇది తొలి పుస్తకంగా వెలువడింది.పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు డా. కె.ఐ.వరప్రసాదరెడ్డి సౌజన్యంతో ఈ పుస్తకం రూపొందించబడింది. బాలల మూర్తి మత్వ వికాస కార్యక్రమానికి ఇతోధికంగా సహాయం చేసిన ఆయన మాతృమూర్తి కోడూరి శాంతమ్మకి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం గొప్ప విషయం.
ఈ బాల కథా సౌరభం మొత్తం 118 పేజీలు కలిగి ఉంది. ప్రధాన సంపాదకులుగా సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, సంపాదకులుగా పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, సంపాదకవర్గం సభ్యులుగా పత్తిపాక మోహన్, గరి పెళ్లి అశోక్ వ్యవహరించగా దీన్ని చొక్కాపు వెంకటరమణ రూపకల్పన చేశారు. ఈ పుస్తకానికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి నా ‘నుడి ‘ పేరుతో ముందు మాట అందించారు. మన అస్తిత్వం, మన భాష,మన సాంప్రదాయాలు,మానవ సంబంధాలు,నైతిక విలువలు నిలిచే విధంగా ఈ పుస్తకం దోహదపడుతుందని, బాలలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఎంతగానో ఉపకరిస్తుందని అందుకు కార్యాచరణ చేసిన సారస్వత పరిషత్తు కృషి అభినందనీయమని తన అభిప్రాయం వెలువరించారు.

ఈ గ్రంథాన్ని బాల సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు పిల్లలచే చదివింపజేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అప్పుడే మెరుగైన సమాజం నైతిక విలువలతో ఆవిర్భవించగలదని సూచించారు. ఈ పుస్తకానికి ప్రవేశిక డాక్టర్ చెన్నయ్య గారు అందించారు. అదేవిధంగా పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు…చదువు సంస్కారం మాత్రమేనని బాల సాహితీ భూషణ చొక్కాపు వెంకటరమణ తన ముందుమాటలో తెలిపారు. ఎంతోమంది ప్రముఖులు పుస్తకానికి ముందు మాట అందించారంటేనే పుస్తకం గొప్పతనం ఏమిటో తెలుసుకోవచ్చు .బాల కథా సౌరభంలో పుక్కిట పురాణ కథలు, పంచతంత్ర కథలు, తెలుగు జాతీయాల కథలు, స్ఫూర్తి కథలు, నెలల కథలు, చరిత్ర కథలు, పురాణ బాలల కథలు, సామెతల కథలు, వేమన శతక కథలు, దశావతారాల కథలు, విజ్ఞాన ఆవిష్కరణల కథలు, ప్రముఖుల బాల్య కథలు, ఇతర భాషల కథలు, పాత కొత్త కథలు అనే 14 విభాగాలలో ఒక్కొక్క విభాగంలో ఏడు కథలు ఒక్కో పేజీకి మించకుండా ఉన్నాయి. పుక్కిట పురాణ కథలు పేరుతో మొదటి విభాగంలో ‘అశోక వనములో అన్ని ఎర్రటి పూవులా?‘ అనే కథ ఇలా ప్రచురింపబడింది. పూర్వం ఒక స్వామీజీ గురుకులం నడుపుతుండేవాడు. ప్రతిరోజు రామాయ ణం కథను శిష్యులకు చెప్పేవాడు.

ఆ కథను వినడానికి సాక్షాత్తు ఆంజనేయుడు ఒక శిష్యుడి రూపంలో వచ్చి విన్నాడు. అంటే స్వామీజీ చెప్పే కథలు అంత వినుసంపుగా ఉంటాయని అర్థం. అందుకే ఆంజనేయ స్వామిని కూడా ఆకర్షించాయి ఆ కథలు.ఒకరోజున స్వామీజీ…. అశోక వనంలో సీతమ్మ కూర్చుని దిగులుగా ఉంది. రాముడు పంపిన ఆంజనేయుడు లంకకు చేరాడు. అశోక వనంలోకి ప్రవేశించాడు. అశోకవనంలో తెల్లని పూలు విరగబూశాయి అని చెప్పాడు. శిష్యుని రూపంలో ఉన్న ఆంజనేయుడికి ఒక సందేహం వచ్చింది. గురువుగారు…. అశోకవనంలోని అన్ని మొక్కలకు ఎర్రటి పూలే కదా ఉన్నాయి.! అని ఆంజనేయుడు అన్నాడు. లేదు నాయనా! అన్నీ తెల్లటి పూలే ఉన్నాయి. అన్నాడు స్వామీజీ. తెల్లటి పూలని, ఎర్రటి పూలని చాలాసేపు ఇద్దరూ వాదించుకున్నారు. కొద్దిసేపటికి కోపోద్రిక్తుడైన ఆంజనేయ స్వామి నిజ స్వరూపం చూపించాడు.అయినా స్వామీజీ.. ‘నాయనా ఆంజనేయ! అశోక వనములోకి ప్రవేశించిన నీకు తెలియదా అవన్నీ తెల్లటి పూలని ‘ అని అన్నాడు. ఆంజనేయుడికి విసుగు పుట్టి శ్రీరాముని వద్దకు వెళ్లి వెంటబెట్టుకొచ్చాడు.

‘చూడు రామా! గురువుగారికి వయసు మీద పడింది. మతిమరుపు వచ్చింది. అశోకవనంలో ఎర్రటి పూలు ఉంటే తెల్లటి పూలు అని చెబుతున్నాడు.‘ అని ఆంజనేయస్వామి అన్నాడు. ‘లేదు హనుమా.. గురువుగారు చెప్పింది నిజం. అవి తెల్లటి పువ్వులే‘ అని చిరునవ్వుతో అన్నాడు శ్రీరాముడు. ‘అదేమిటి రామ! ఏ విధంగా?‘ అని అడిగాడు ఆంజనేయుడు.హనుమా! నీవు అశోక వనములోకి ప్రవేశించగానే సీతమ్మవారు ఒంటరిగా, దిగులుగా కూర్చొని కనిపించింది. ఆ స్థితికి కారణమైన రావణుడిపై నీకు విపరీతమైన కోపం వచ్చింది. ఎర్రబడ్డ నీ కళ్ళతో చూసేసరికి తెల్లటి పువ్వులు ఎర్రగా కనిపించాయి. అంతే తప్ప అవి ఎర్ర పూలు కావు తెల్లటి పూవులే. మనం ఎలాంటి దృష్టితో చూస్తే అవి అలానే కనిపిస్తాయి‘ అన్నాడు శ్రీరాముడు. ఆంజనేయుడుకి కనువిప్పు కలిగింది. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని అర్థమైంది. ఇటువంటి చిన్న చిన్న కథలు పిల్లలు చదివేటప్పుడు ఆదర్శంగా ఉండటమే కాకుండా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అదేవిధంగా ద్రౌపది పిలువగానే కృష్ణుడు రాలేదేం? / బకాసురుడి భోజనం / ధర్మరాజు కళ్ళు తెరిపించిన భీముడు / కృష్ణుడికి అరటి తొక్కలు తినిపించిన విదురిని భార్య / ఉడత సాయం / తన బిడ్డలను గంతలు విప్పి చూడని గాంధారి మొదలైన ఏడు కథలు పుక్కిట పురాణ విభాగంలో వివరించబడ్డాయి.

ఈ కథలు చదువుతున్నంత సేపు ఇంకా చదవాలనిపిస్తుంది. ప్రతి కథలో నీతి ఉంది. పిల్లల్ని ఆకర్షించే విధంగా ఉండడమే కాదు పెద్ద వారిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. దొరికిన దానితో తృప్తిపడాలి / పేరాశ ప్రాణాలకు ప్రమాదం / ఎవరి పని వారే చేయాలి /నిజం ఎప్పటికైనా నిగ్గు తేలుతుంది/ జాతి బుద్ధి ప్రాణం తీసింది/ నలుగురు చెబితే నిజమవుతుంది / తాబేలు తెలివి ఇలా ఏడు కథలు కూడా పంచతంత్ర కథలు లో ఉన్నాయి. అదేవిధంగా సామెతల కథలు,తెలుగు నెలల కథలు, చరిత్ర కథలలో శివాజీ ఔదార్యం / ఆచార్య నాగార్జునుడి తెలివి పరీక్ష / జలియన్వాలా బాగ్ దురంతానికి కదిలిపోయిన బాల భగత్ సింగ్/ స్వరాజ్యం నా జన్మ హక్కు నినాదం ఎందుకు / పాహియాన్ తెలుసుకున్న భారతీయ ధర్మం / చాణక్య నీతి / భారతదేశ యాత్రలో హుయాన్ సాంగ్ ను కదిలించిన దృశ్యం వంటి చారిత్రక నేపథ్యం కలిగిన కథలు సంక్షిప్తంగా పేర్కొనబడ్డాయి. పురాణ బాలల కథలు విభాగంలో మాతృభక్తి -గణపతి, పితృభక్తి – నచికేతుడు / గురుభక్తి- ఏకలవ్యుడు / ఏకాగ్రత- ప్రహ్లాదుడు / ఆత్మాభిమానం- దృవుడు / సంకల్ప బలం- మార్కండేయుడు / సాహస గుణం- లవకుశలు ఏడు కథలు ఉన్నాయి.

ఇదే తీరులో సామెతల కథలు ఏడు, వేమన శతక కథలు ఏడు దశావతార కథలు పది, విజ్ఞాన ఆవిష్కరణ కథలు ఏడు, ప్రముఖుల బాల్యం కథలు ఏడు వివరించబడ్డాయి. అదేవిధంగా ఇతర భాషల కథలు విభాగంలో డాక్టర్ పత్తిపాక మోహన్ రాసిన చుక్కల లెక్క (బెంగాలీ కథ), సముద్రం ఉప్పు నీళ్లు (జపాన్ కథ),కుందేలు తెలివి (అమెరికా ఆదివాసుల కథ), పులిని చేసినోళ్లు (కనడ కథ), అసలు దొంగ (హిందీ కథ) వంటి అయిదు కథలు చాలా బాగున్నాయి. పాత కొత్త కథలు అధ్యాయంలో డాక్టర్ సిరి రాసిన సీత కథ, ఎదగని మొక్క, రంగు మారిన బంగారం, డాక్టర్ పైడిమర్రి రామకృష్ణ రాసిన కాకమ్మ పిచ్చుకమ్మ కథ, బుద్ధొచ్చిన కాకి వంటి కథలు ఇందులో చోటు చేసుకున్నాయి.బాల కథా సౌరభం పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్ తొట్ట తొలి ఈ పుస్తకంలో ప్రతి కథ సంక్షిప్తంగా, పిల్లల్ని ఆనందపరిచే విధంగా ఉన్నాయి. ఈ పుస్తకం ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండ తగ్గది. కవర్ పేజీ డిజైన్ చేసిన బాబు, లోపలి పేజీలలో బొమ్మలు వేసిన మహేష్ కుమార్, అచ్చు తప్పులు లేకుండా డిటిపి చేసిన నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ అభినందనీయులే.

పుస్తకము రూపకల్పనకు విశేషంగా రూపకల్పన చేసిన గరిపెల్లి అశోక్ గారికి, పత్తిపాక మోహన్ గారికి, చుక్కాపు వెంకటరమణ గారికి, డాక్టర్ భూపాల్ గారికి, డాక్టర్ దాసరి వెంకటరమణ గారికి, వి ఆర్ శర్మ గారికి, సుధామ గారికి, వేదాంత సూరి గారికి, సిరి గారికి, పైడిమర్రి రామకృష్ణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బాల కథా సౌరభం బాలల్లో మార్పు తీసుకు వస్తుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News