ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అనువైన కొత్త సాగు విధానం ప్రకటించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉండాలి అన్న అంశంపై సోషియల్ డెమక్రటిక్ ఫోరం కన్వీనర్ మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళీ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వ్యసాయరంగంలో పంటలకు పెట్టుబడికి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని కోరారు. అదే విధగా పంటల భీమా అమలు చేయాలన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేయాలని ,ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, వ్యవసాయరంగం వ్యవస్థను మండల స్థాయిలో వికేంద్రీకరించాలన్నారు.వ్యవసాయానికి బడ్జెట్‌లో మరో 6శాతం అదనంగా నిదులు పెంచాలని కోరారు. రైతులు ఎక్కడా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో భూములు కొనుగొలు చేసే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. రైతుకుటుంబాల సగటు ఆదాయం ఎంతో తక్కువగా ఉందన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ మురళితోపాటు రైతు స్వరాజ్య వేదిక నుంచి కన్నెగంటి రవి, తెలంగాణ రైతుసంఘం నేత శోభన్ తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు.