Monday, December 23, 2024

తిరుమల నడక మార్గంలో ఇక భక్తుల చేతికి ఊతకర్ర : టిటిడి నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నట్లు స్వయంగా టిటిడి అంగీకరించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కమిటీ తీసుకున్న నిర్ణయాలను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడిస్తూ .. నడకమార్గంలో రాత్రి 10 గంటల వరకు పెద్దవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఘాట్‌రోడ్‌లో వెళ్లే ద్విచక్ర వాహనాలకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లలను అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించామని, నడకదారిలో జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని భక్తులకు సూచించారు. ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నడకమార్గంలో లైటింగ్ ఏర్పాట్లు..
భద్రత కోసం డ్రోన్లను సైతం వినియోగించాలని నిర్ణయించామని.. తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతామన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన లక్షిత చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిందన్నారు. నడకదారిలో భక్తులకు ఎలాంటి అపాయం లేకుండా చూసేదుకు అటవీశాఖ, పోలీస్‌శాఖలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు.

సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అటవీశాఖ సూచనలు చేసిందని చెప్పారు. భక్తులపై చిరుత దాడులపై చర్చించామని, భక్తుల భద్రతలకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. నడకదారిలో ఇరువైపులా లైటింగ్‌తో పాటు బేస్ క్యాంప్, మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టిటిడి వెల్లడించింది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పలు నిర్ణయాలు తీసుకున్నామని, భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇకపై కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి ఓ ఊతకర్ర ఇవ్వనున్నామని, ఇదే వారికి ప్రధాన ఆయుధమని చెప్పారు. నడకమార్గంలో భక్తులను అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తామని, కేంద్ర అటవీశాఖ అధ్యయనం చేసిన తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు పడేయొద్దని, బయట వ్యర్థాలను వదిలేసే షాపులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కాలినడకన వెళ్లే వారికి గతంలో మాదిరి టికెట్లు మంజూరు చేస్తామని, 15వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు ఇస్తున్నామని, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలన్నారు. ఇకపై భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదని భూమన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News