రుద్ర రచనను అభినందించిన మంత్రి కెటిఆర్
సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన యువతి
మంత్రి కెటిఆర్ సాయంతో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం పొందిన రచన
తనలాంటి అనాథలను ఆదుకోవడానికే ఈ విరాళం : రుద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘గ్రేట్ జాబ్ రుద్ర రచన’ అంటూ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ‘ఇది నాకు మరిచిపోని రోజు’గా ఆయన ట్విట్టర్‌లో అభివర్ణించారు. ‘నాలాంటి తోటి అనాథలను ఆదుకోవాలనే లక్ష్యంతో నేను నా జీతం నుండి రూ.1 లక్షను సిఎం కెసిఆర్ రిలీఫ్ ఫండ్‌కి స్వయానా సిఎం కెసిఆర్‌కు అందించాన’ని రుద్ర రచన పేర్కొనడంతో మంత్రి కెటిఆర్‌పై విధంగా ప్రతిస్పందించారు. మంత్రి కెటిఆర్ అండదండలతో బి.టెక్ మూడేళ్ల డిప్లోమా కోర్సును విజయవంతంగా సాధించి, ఆపై తాను సమాజంలో నిలదొక్కుకోవడమే కాకుండా తన లాంటి అనాధలు మరెవ్వరూ తనలా ఇబ్బందులు పాలవ్వకూడదనే సదాశయంతో రుద్ర రచన జాబ్‌ని పొందిన నాలుగు నెలల వ్యవధిలో తన జీతం నుండి రూ.1 లక్ష రూపాయలు సిఎం కెసిఆర్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వడం ఆమె దయార్థ్ర హృదయానికి అద్దం పడుతోంది.
కష్టే ఫలి… రుద్ర రచన నేపథ్యమిది…!
కష్టపడింది.. ఫలితాన్ని సాధించింది రుద్ర రచన. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడ్లోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ విద్య్ పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్రరచన తన ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్రరచన ఆర్ధిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కెటిఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కెటిఆర్ వ్యక్తిగతంగా భరించారు. కెటిఆర్ ఆర్ధిక సహాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది.
కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ పొందింది..
అయితే నాలుగు కంపెనీలలో కాగ్నిజెంట్ కంపెనీని రుద్ర రచన ఎంచుకుంది. ఆరు నెలల ఇంటర్న్‌షిప్ చేసి, గడిచిన నాలుగు నెలలుగా కాగ్నిజెంట్ కంపెనీలో పూర్తిస్థాయిలో ఉద్యోగంలో రుద్ర రచన చేరింది. ప్రస్తుతం సంవత్సరానికి ఆమె 4 లక్షలు గడిస్తోంది
ఆశయ సాధన కోసం..
ఇదే సందర్భంలో రుద్ర రచన ను ‘మన తెలంగాణ ప్రతినిధి’ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను మన తెలంగాణ పంచుకుంది. తాను చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయానని ఆమె వివరించింది. అనంతర కాలంలో అక్క తన ఆలనా పాలనా చూసుకునేదని తెలిపింది. అక్క మ్యారేజీ అయి వెళ్లిపోయిన తర్వాత తన ఆశయ సాధన కోసం తీవ్రస్థాయిలో కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొంది. జగిత్యాల బాలసదన్‌లో, యూసఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో ఉంటూ 10వ తరగతి, పాలిటెక్నిక్ విద్య పూర్తి చేశానని వెల్లడించింది. అనంతర కాలంలో ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ర్యాంకును పొందగలిగానని పేర్కొంది. ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనుకున్నప్పటికీ ఆర్థిక స్థోమత తన కాళ్లకు బంధాలు వేసింది. అదే సమయంలో తన దీనస్థితిని తెలుసుకున్న మంత్రి కెటిఆర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడూ ముందుండే కెటిఆర్ వెనువెంటనే స్పందించారని, తన మంచి మనసుని కనబర్చి తన జీవితాన్ని నిలబెట్టారన్నారు. మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యకయ్యే ఖర్చుని భరించి తాను తన సొంత కాళ్ల మీద నిలబడేలా చేశారన్నారు. ఈ సందర్భంగా రుద్ర రచన మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపడంతో పాటు తాను పొదుపు చేసిన డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించి ఆ రాఖీని మంత్రి కెటిఆర్‌కు కట్టి తన అభిమనాన్ని రుద్ర రచన చాటుకున్నారు. ఇదే సందర్భంలో భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్నా తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారని రుద్ర రచన వెల్లడించారు.
అనాథ శరణాలయ స్థాపనే లక్ష్యం…
భవిష్యత్తులో అనాధ శరణాలయాన్ని స్థాపించి, తోటి అనాథలను ఆదుకోవాలన్నదే తన జీవిత ధ్యేయమని రుద్ర రచన ఈ సందర్భంగా పేర్కొంది. తన ఆలనా పాలనా చూసుకున్న తన అక్క ఇప్పటీక బీడీ కార్మికురాలిగానే జీవనం వెలిబుచ్చుతున్నారని గుర్తు చేశారు. తాను కాగ్నిజెంట్‌లో పూర్తిస్థాయి ఉద్యోగినిగా నాలుగు నెలల క్రితమే చేరానని ఆమె పేర్కొన్నారు. తనకు ప్రభుత్వం చేసిన సాయం ఎన్నటికీ మరువలేనిదని ఆమె కృతజ్ఞతాభావాన్ని ఈ సందర్భంగా కనబర్చారు. ఇదే క్రమంలో తన లాంటి తోటి అనాథలను ఆదుకోవాలనే లక్షంతో తన జీతం నుంచి సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష రూపాయల చెక్‌ను సిఎం కెసిఆర్‌కు స్వయంగా అందజేసినట్లు ఆమె వెల్లడించారు. ఏది ఏమైనా ఇకపై తన దృష్టంతా అనాథ శరణాలయాన్ని స్థాపించి తోటి అనాథలను ఆదుకోవడమే తన లక్ష్యమని రుద్ర రచన పునరుద్ఘాటించారు.