Monday, December 23, 2024

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నా హృదయం… పౌరసత్వం… రెండూ హిందుస్థానీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని అక్షయ్ ఇంటర్వూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో కోరారు.

అయితే ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చారు. భారత్ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పలుమార్లు చెప్పారు. ఈ క్రమం లోనే ఆయనకు భారత పౌరసత్వం లభించింది. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వూలో వివరించారు. ‘ 1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి.

కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్టుకు అప్లయ్ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్టు వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్ లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమం లోనే పాస్‌పోర్టు విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని అక్షయ్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News