Friday, November 22, 2024

రెడ్కో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రధాన కార్యాలయంలో 77వ స్వాంతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగం ఫలితంగా నేడు మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, బాలాగంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు.స్వాతంత్య్ర వీరుల జీవిత చరిత్రలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.

స్వాంతంత్య్ర పోరాటస్పూర్తితోనే మన ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమనాయకుడు కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. 60 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధిని 9 ఏళ్లలో సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు తలసరి విద్యుత్ వినియోగం 1100 యూనిట్లుగా ఉంటే నేడు 2100 యూనిట్లకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం  లక్షా 25 వేల నుంచి 3 లక్షల 8 వేలకు పెరిగిందని, ఇది ప్రతీఒక్కరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు అవుతున్నా భరతమాతను పూజించే మనదేశంలో మహిళలపై అకృత్యాలు జరగడం బాధాకరమన్నారు.

భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవేదికలపై రెపరెపలాడించిన క్రీడాకారులు లైంగిక వేధింపులతో ఢిల్లీలో 6 నెలలుగా ఆందోళన చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మణిపూర్ లో యువతులను నగ్నంగా ఊరేగించడం దేశమంతా తలదించుకోవాల్సిన దారుణ ఘటన అన్నారు.ఇలాంటి ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పిల్లల పెంపకంలోనూ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మంచి చెడులు నేర్పించాలని సూచించారు. ఎవరైనా వేధించినా ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలతో స్నేహంగా మెలగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్ర స్పూర్తితోనేడు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం పెరగడమే దీనికి నిదర్శనమన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటి ఒక్కరు తమ ఇంటి నుంచి కాలుష్య నియంత్రణను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. కర్బన ఉద్గారాలు లేని దేశంగా మన దేశాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎం ప్రసాద్ , సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News