సిమ్లా : సిమ్లా లో కూలిపోయిన శివాలయం శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాలను మంగళవారం వెలికి తీశారు. దీంతో ఇప్పటివరకు బయటపడిన మృతదేహాల సంఖ్య 16 కు చేరింది. ఆదివారం రాత్రి నుంచి కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు కూలడం తదితర దుర్ఘటనల కారణంగా మృతులైన వారి సంఖ్య 53 కి చేరింది. సిమ్లా లోని సమ్మర్‌హిల్, ఫగ్లీలో శిథిలాల కింద ఇంకా పదిమంది ఇరుక్కుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు.
సమ్మర్‌హిల్ ప్రాంతంలో భారీ వర్షాలకు సోమవారం సాయంత్రం ఆగిపోయిన రిస్కు ఆపరేషన్లు మంగళవారం ఉదయం 6 గంటలకు మళ్లీ మొదలయ్యాయి. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో ఈనెల 19 వరకు బోధనా తరగతులను రద్దు చేశారు. మండి జిల్లాలో వర్షాల కారణంగా వివిధ సంఘటనల్లో సోమవారం 19 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి సెఘిల్ పంచాయతీలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.