మెడిసిన్ కోర్సు తర్వాత పిల్లల వైద్యం కోసం ప్రత్యేక చదువు పూర్తి చేసిన చిల్డ్రన్ స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నట్లే ముసలాళ్ల కోసం కూడా విడి కోర్సు చేసే వృద్ధుల స్పెషలిస్టులు కూడా ఉంటారు. ఇంగ్లీష్ లో పిల్లల డాక్టర్‌ను పీడియాట్రీషియన్ అన్నట్లే వృద్ధుల డాక్టర్‌ను జీరియాట్రిషియన్ అంటారు. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని పౌరులకు వీరి గురించి తెలిసినంతగా మన దేశంలో తెలియదు. అసలు ఇలా ఉంటారా అని మనవాళ్ళు ఆశ్చర్యపోయినా పోవచ్చు. ఎందుకంటే ఎక్కడా అలాంటి ప్రాక్టీసు పెట్టుకున్న వైద్యుడు గాని, ఎంత పెద్ద హాస్పిటల్‌కు వెళ్లినా డాక్టర్ల, స్పెషలిస్టుల జాబితాలో లేదా అక్కడి సేవల్లో జీరియాట్రిషియన్ ప్రస్తావన కనబడదు. ఇప్పటికే చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో జీరియాట్రిషియన్లు మిగితా స్పెషలిస్టుల మాదిరే పేషేంట్లతో బిజీగా ఉన్నారు. దేశ జనాభాలో వృద్ధులు జపాన్‌లో 28%, ఇటలీలో 23%, అమెరికాలో 16% ఉండగా, పక్క చైనాలో 12%, మన దేశంలో 11% ఉన్నారు. సంఖ్యాపరంగా చైనాలో 16 కోట్లు కాగా, ప్రపంచంలో రెండో స్థానం మనదే. ఇక్కడ వృద్ధులు 14 కోట్ల సంఖ్యను దాటేశారు.
మన దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్య కూడా 12 కోట్ల దాకా ఉంటుంది. ఈ లెక్కన పిల్లల డాక్టర్లలో సగంలో సగమైనా పెద్దల డాక్టర్లు లేరనేది అర్థమైపోతుంది. ప్రపంచంలో చాలా దేశాలు వృద్ధులకు ప్రత్యేక డాక్టర్లు అవసరం అన్న నిజాన్ని ఇప్పటికే గ్రహించి వైద్య విద్యలో సంబంధిత కోర్సులను ఆరంభించి వృద్ధుల చికిత్స విధానాన్ని వేరు చేసి ఆ సేవలు అందిస్తున్నాయి. అభివృద్ధిలో మనం ప్రపంచంలో మూడో స్థానం, నాలుగో స్థానం అంటున్న పాలకులకు దీని గురించి ఆలోచన కూడా తట్టినట్లు కనబడదు. వృద్ధుల సంరక్షణ, భద్రత కోసం కొన్ని చట్టాలు రూపొందించారు తప్ప స్పెషలిస్టు డాక్టర్ల అవసరాన్ని మాత్రం గ్రహించినట్లు లేదు. మన దగ్గర తయారు అయ్యే కొన్ని మందులపై పిల్లలు, గర్భిణులు వాడకూడదనే హెచ్చరిక ఉంటుంది. కానీ వృద్ధుల గురించి ఏమీ ఉండదు. అమెరికా జీరియాట్రిక్స్ సొసైటీ ముసలాళ్లపై సైడ్ ఎఫెక్ట్ కలిగించే మందుల చిట్టాను తయారు చేసి అమలులోకి తెచ్చింది. అలాంటి అభ్యంతరాలు మన దగ్గర లేవు. అదంతా డాక్టర్ల విచక్షణకే వదిలేస్తున్నారు.
మన దేశంలో వృద్ధుల ఆరోగ్య పరిస్థితి చూస్తే అరవై దాటినవారిలో 75% మంది ఏదో ఒక రుగ్మతతో బాధపడుతూ దీర్ఘకాల వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.అందులో 40% ఏదో ఒక వైకల్యంతో ఇంటికే పరిమితమయ్యారు. 20% మానసిక ఆరోగ్య సమస్యలతో గడుపుతున్నారు. కొందరు తమను పట్టిపీడిస్తున్న బాధను కూడా వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు.వీరందరికీ భిన్న పిజి కోర్సులు చేసి అన్ని వయసుల వారిని సాధారణంగా పరీక్షించే వైద్యులే చెకప్ చేసి మందులు ఇస్తున్నారు. అసలు వారి చదువులో ఎనభై ఏళ్ల వయస్కులకు చికిత్సచేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చదివారా అనే దానికి సమాధానం కావాలి. 2022లో ముంబైలోని కెఇఎమ్ హాస్పిటల్ జరిపిన అధ్యయనంలో కేవలం 48% డాక్టర్లకే వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులపై అవగాహన ఉందని, 9% డాక్టర్లు మాత్రమే వృద్ధులకు సరియైన వైద్యం ఇస్తున్నారని తేలింది. వృద్ధులు మాములుగా మధుమేహం, రక్తపోటు, కండరాల బలహీనత, ఎముకల బోలుతనం, గుండె, కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు.
వాటిని పరిమితిలో ఉంచడానికి దీర్ఘకాలంగా మందులు అవసరం.ఇలా ఏకకాలంలో భిన్న రుగ్మతలకు కొందరు విడి విడిగా మందులు వాడుతుంటారు. అయితే కొన్ని మందు లు కొన్నిటికి చుక్కెదురులా ఉంటాయి. గుండెను చూసే డాక్టర్ ఒకరైతే మూత్రపిండాలను క్రమపరిచే హస్తవాసి వేరు. ఇద్దరు ఎవరి మందులు వారు రాస్తారు. అప్పటికే వాడుతున్న మందులేవో ఉంటాయి. ఇలా రోజుకు 8 నుంచి 12 రకాల మందులు వాడుతున్నవారు ఎందరో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని రకాల మందుల కొనుగోలుకు కూడా చాలా డబ్బు వెచ్చించవలసి వస్తోం ది. అదే సమయంలో వృద్ధుల ప్రత్యేక డాక్టర్ ద్వారా చికిత్స అందితే మందుల సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కాంబినేషన్ మెడిసిన్ వల్ల మందుల సంఖ్య తగ్గి, డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇలా జరిగితేనే వృద్ధుల వైద్యం ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఇదంతా జీరియాట్రిషియన్ల వల్లే సాధ్యం. కేంద్రం ప్రవేశపెట్టిన జీరియాట్రిక్ వైద్య సేవలు ఆచరణలో అడుగులు పడిన దాఖలాలు లేవు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రులలో జీరియాట్రిక్ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కోర్సు చదివినవారే వైద్యం అందిస్తే తగిన ఫలితముంటుంది. వృద్ధుల వైద్య విద్య విషయానికొస్తే మన దేశంలో జీరియాట్రిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సు మొదలు పిజి దాకా చదివే అవకాశముంది. డిగ్రీ స్థాయిలో జీరియాట్రిక్ కేర్ మేనేజ్‌మెంట్ కొన్ని కాలేజీల్లో ఉంది. మంగళూరు, మణిపాల్ కాలేజీల్లో జీరియాట్రిక్ ఫిజియో థెరపీ కోర్సులున్నాయి. వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ ఉన్న డాక్టర్లు 2018లో ఏర్పాటు చేసిన జీరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఎన్‌జిఒ సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. ఈ సంస్థకు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సహకారం ఉంది. నాగాలాండ్‌లోని గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎమ్మెస్సీ చదవవచ్చు. ఇగ్నో సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన స్టడీసెంటర్లు అన్ని ఉత్తర భారతంలోనే ఉన్నాయి. అయితే ఆ విద్యనందించే కాలేజీలు, సీట్లు దేశ అవసరాలు తీర్చే స్థాయిలో లేవు. ఈ లెక్కలతో సంఖ్యాపరంగా, ప్రాధాన్యతాపరంగా వృద్ధుల ఆరోగ్య సంరక్షణపట్ల ప్రభుత్వాలు తగిన శ్రద్ధ కనబరచడం లేదని తెలుస్తోంది.
వైద్య విద్య, పరిశోధనలలోనూ కూడా ఈ అంశం నిరాదరణకు గురవుతోందనుకోవచ్చు. తగిన అవకాశాలు కల్పిస్తే మెడికల్ కోర్సులు చదివేవారికి ఈచదువుపై ఆసక్తి పెరిగి కాలేజీలు, కోర్సులు, సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా ప్రభుత్వాలు చేయవలసినపని. పాలకుల్లో అధిక శాతం సీనియర్ సిటిజన్లే ఉన్నా తమ తోటి వారి ఆరోగ్యం పట్ల ఆసక్తి కనబరచకపోవడం అసలైన విషాదం.