Friday, December 20, 2024

మథురలో ఇళ్ల కూల్చివేత నిలిపివేతకు సుప్రీంకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి సమీపాన ఆక్రమణల తొలగింపు కోసం రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 10 రోజులపాటు యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని రైల్వే అధికారులను కోర్టు ఆదేశించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

కృష్ణభూమి సమీపంలో కూల్చివేతలు జరుగుతున్నాయని, చాలా ఇళ్లను కూల్చివేశారని పిటిషనర్ యాకూబ్ షా తరఫున సీనియర్ న్యాయవాది పిసి సేన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ కోర్టులకు సెలవు ఉన్న రోజున కూల్చివేతల ప్రక్రియను నిర్వహించారని, న్యాయస్థానం జోక్యం చేసుకుని దీన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. 1800 శతాబ్దాల నాటి నుంచి ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, కూల్చివేతల వల్ల దాదాపు 3.000 మంది నిరాశ్రయులవుతారని ఆయన వాదించారు. స్టేటస్ కో పాటించాలని ఆదేశించిన న్యాయస్థానం కేంద్రానికి, రైల్వేలకు నోటీసులు జారీచేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదావేసింది.

మథుర నుంచి బృందావనం వరకు ప్రస్తుత ఉన్న మీటర్‌గేజ్ రైల్వే లైను స్థానంలో బ్రాడ్‌గేజ్ లైను వేయడంలో భాగంగా రైల్వే స్థలంలో ఆక్రమణలను తొలగించడానికి రైల్వేలు ఇళ్ల కూల్చివేతలను చేపట్టింది. మథుర సివిల్ కోర్టులో తమ అప్పీలు పెండింగ్‌లో ఉన్న సమయంలో కూల్చివేతలను చేపట్టడం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమేనని పిటిషనర్ యాకూబ్ షా వాదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News