న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పుల్లో భాగంగా మహిళల పట్ల లింగ వివక్ష లేకుండా చూసే విషయంలో కీలక ముందడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళల ప్రస్తావనలో వాడాల్సిన పదాలు, వాక్యాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేసింది.
హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ పేరుతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పుస్తకాన్ని విడుదల చేశారు. న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు తీర్పుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా వాడే పదాలు సరైనవి కావు. అయితే ఆ తీర్పులను విమర్శించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదు.
లింగత్వానికి సంబంధించి మూసపద్ధతులు ఎలా ఆచరణలో ఉన్నాయో చెప్పేందుకే ఈ పుస్తకం అని చీఫ్‌జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. లింగ వివక్షకు నిర్వచనం, న్యాయాధికారుల్లో అవగాహన పెంచడమే ఈ హ్యాండ్‌బుక్ లక్షమని పేర్కొన్నారు . మహిళలపై మూసధోరణిలో వాడే పదాలను గుర్తించేందుకు న్యాయమూర్తులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.