న్యూఢిల్లీ : శాంతిభద్రతలు కాపాడటంతోపాటు పౌరులకు రక్షణగా నిలవాల్సిన ఓ ఐపీఎస్ అధికారి తీరు చర్చనీయాంశమైంది. గోవా లోని ఓ నైట్ క్లబ్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు రావడంతోపాటు అక్కడి అసెంబ్లీ లోనూ చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆ ఐపీఎస్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. 2009 బ్యాచ్, ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం మరియు యూటీ) కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏ కోవన్… గోవాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అక్కడి నైట్ క్లబ్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబందించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) అక్కడి అసెంబ్లీలో లేవనెత్తింది.
సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ నివేదిక కేంద్ర హోం శాఖకు చేరడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. తక్షణమే ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. గోవా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తున్నామని ముందస్తు లేకుండా అక్కడ నుంచి వెళ్లవద్దని ఆదేశించింది. ఆ డీఐజీ ర్యాంక్ అధికారిని గోవా ప్రభుత్వం ఇప్పటికే రిలీవ్ చేయగా, డీజీపీకి రిపోర్టు చేయాలని పేర్కొంది.