- జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
జనగామ ప్రతినిధి : ఓటరు నమోదు ఆవశ్యకత, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 19న జనగామ పట్టణంలోని శామీర్‌పేట దుర్గమ్మగుడి నుంచి ప్రారంభమై కోర్టు సెంటర్, నెహ్రూ పార్కు, జనగామ చౌరస్తా, ఐడీఓసీ ద్వారా కొనసాగి బతుకమ్మకుంటలో ముగిసే 5కే రన్‌ను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య కోరారు. గురువారం జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ఈఆర్‌ఓస్, ఏఈఆర్‌ఓస్, స్వీప్ నోడల్ ఆఫీసర్, ఎన్నికల విభాగం సిబ్బందితో కలిసి ఓటరు నమోదు, ఎన్నికల విధులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించి సంబంధిత డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు తదితర విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోని వారిని గుర్తించి నమోదు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఓటు ఆవశ్యకత, నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ కొనసాగే కార్యక్రమాలు ఓటరు జాబితా సవరణలు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, ఫొటో ఓటరు కార్డు, ఆడ, మగ ట్రాన్స్‌జెండర్స్, ఓటర్లను గుర్తించి ఓటరుగా నమోదుకానీ వారిని నమోదు చేయాలని, 80 వయసు పైబడిన వారిని పీడబ్లూఓ, సీనియర్ సిటిజన్స్ తదితర ఓటర్లను గుర్తించి వారికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటరు నమోదు అవగాహనపై చునావ్ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లను బూత్ లెవల్ అధికారులతో కలిసి పరిశీలించాలని, ఎన్నికలకు సంబంధించి విధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు, తనిఖీలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఉప ఎన్నికల అధికారిణి సుహాసిని, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ ఈఆర్‌ఓలు రామ్మూర్తి, మురళీకృష్ణ, స్వీప్ నోడల్ ఆఫీసర్ వినోద్‌కుమార్, సీపీఓ ఇస్మాయిల్, ఎన్నికల విబాగం తహసీల్దార్ ఏతేశాం అలీ, డీటీ శంకర్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.