గువాహటి: మణిపూర్‌లో నాగాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో హింసాకాండ చెలరేగడం ఇదే మొదటిసారి.
ఉఖ్రుల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తోవలై కుకీ గ్రామంలో తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామాన్ని కాపలా కాసేందుకు నియమించుకున్న ముగ్గురు వ్యక్తులు ఈ ఘర్షణలో మరణించినట్లు ఉఖ్రుల్ ఎస్‌పి నింగ్‌షెమ్ వాషుమ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న హింసాకాండకు సంబంధించిందే ఈ ఘటన కూడానని ఆయన చెప్పారు.
గ్రామంలోకి చొరబడిన దుండగులు గ్రామంలో పహరా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపారని ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడకు సైన్యం, పోలీసు సిబ్బంది చేరుకున్నారని ఆయన తెలిపారు. ఇది చాలా మారుమూల గ్రామమని, సమీప సెక్యూరిటీ పోస్టు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన వివరించారు. అందుకే భద్రతా సిబ్బంది ఆ గ్రామంలో ఆ సమయంలో లేరని ఆయన తెలిపారు.