Monday, December 23, 2024

జిడికె 11వ గనిలో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని జిడికె 11వ గనిలో బుల్లెట్ షిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి బుల్లెట్ షిఫ్ట్‌లో గనిలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న జెఎంఎస్ ప్రైవేట్ కంపెనీ ఆపరేటర్ కృష్ణ మురారీ మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. కాగా అధికారుల నిర్లక్షం వల్లనే ప్రమాదం చోటు చేసుకొని ఆపరేటర్ మృతి చెందాడని అటు కార్మికుల నుంచి, ఇటు నాయకుల నుంచి నిరసన వ్యక్తం చేశారు. కాగా మృతదేహాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించి, కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జెఎంఎస్ కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కంపెనీపై చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌ సింగ్ రాజ్‌ఠాకూర్ కూడా మృతదేహాన్ని పరిశీలించారు. కేవలం ఉత్పత్తి కోసమే ఆరాట పడుతూ కార్మికుల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గనిలో జరిగిన ప్రమాదంపై టిఎల్‌పి రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ స్పందిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని సింగేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సందర్శించి, కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గని ప్రమాదంపై ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ స్పందిస్తూ కాంట్రాక్ట కార్మికుల ప్రాణాలను తీస్తూ సింగరేణి యాజమాన్యం లాభాలను అర్జిస్తుందని,

ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా మృతుడు కృష్ణ మురారీ కుటుంబానికి రూ.90లక్షలు చెల్లించేందుకు జెఎంఎస్ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిగిన చర్చల్లో ఒప్పందం జరిగింది. యాక్సిడెంట్ బెన్‌ఫిట్ ద్వారా 65లక్షలు, జెఎంఎస్ యాజమాన్యం చెల్లించేది 25లక్షలు మొత్తం 90లక్షలు మృతుని కుటుంబానికి చెల్లించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News