Saturday, December 21, 2024

కాల్పులకు దారి తీసిన పెంపుడు కుక్కల కొట్లాట.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణంజరిగింది.పెంపుడు కుక్కలగురించి ఇద్దరి మధ్య మొదలైన డవ చివరికి కాల్పులకు దారి తీసింది.రాజ్‌పాల్‌సింగ్ రజావత్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో పక్కింటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. బాల్కనీనుంచి 12 బోర్ గన్‌తో కాల్పులు జరిపిన రాజ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రజావత్, విమల్ అచల ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు. ఈ ఇద్దరూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో కృష్ణబాగ్ కాలనీలో తమ పెంపుడు కుక్కలను బయటికి తీసుకెళ్లారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆ రెండు పెంపుడు కుక్కలు మధ్య పోట్లాట మొదలైంది. దీంతో వాటి యజమానులు కూడా గొడవకు దిగారు.ఆ సమయంలో రజావత్ ఆగ్రహానికి గురయ్యాడు.

ఇంట్లోకి వెళ్లి తన వద్ద ఉన్న 12 బోర్ గన్‌తో బాల్కనీనుంచి కాల్పులకు దిగాడు. రజావత్ కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పై అంతస్థునుంచి అతను కింద ఉన్న వాళ్లపైకి కాల్పులు జరిపాడు. వీధిలో జనం అరుస్తున్నా రజావత్ తన తుపాకీకి పనిపెట్టాడు. దీంతో అచలతో పాటుగా అతని బావమరిది రాహుల్ వర్మ ఇద్దరూ తూటాలకు బలయ్యారు. వీధిలో ఉన్న జనంలో మరో ఆరుగురు కూడా గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రజావత్, అతని కుమారుడిపై హత్య కేసు నమోదు చేశారు.గ్వాలియర్‌కు చెందిన రజావత్‌కుగన్ లైసెన్స్ ఉండడంతో ఓ ప్రైవేటు కంపెనీ అతడ్ని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకుంది. రజావత్ కనీసం మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని, ఆ ప్రాంతంలో ఉన్న సిసి టీవీ కెమెరాల దృశ్యాలను తాము పరిశీలిస్తున్నామని జరానా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి ఉమ్రావ్ సింగ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News