మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్య కారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, మత్సశాఖ కమిషనర్ లచ్చీరాం భూక్యాతో చేపపిల్లల పంపిణీకి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని మంత్రి తలసాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజక వర్గాల పరిధిలో చేపపిల్లల పంపిణీని ప్రారంభించాలని, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, జడ్పీఛైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.
మత్సకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 2017లో ఈ పధకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. మొట్టమొదటి సారి రాష్ట్రంలో 3939 నీటి వనరులలో 27.85 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ సంవత్సరం 26,357నీటి వనరులలో 84.13 కోట్ల రూపాయల ఖర్చుతో 85.60 కోట్ల ఖర్చుతో చేపపిల్లలను విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అదే విధంగా మత్సకారులకు అదనపు ఆదాయం వచ్చేవిధంగా రొయ్యపిల్లలను కూడా విడుదల చేయనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు.