హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలవనుంది, హైదరాబాద్ వేదికగా ఆగస్టు 25 నుంచి స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. భారత్‌తో పాటు కెనడా, అమెరికా, యెమన్‌లకు చెందిన క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ సహకారంతో రాష్ట్ర చెస్ సంఘం ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఫిడె 1600 రేటింగ్‌కు దిగువన ఉండే మాస్టర్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి పెద్ద చెస్ టోర్నమెంట్ జరుగడం ఇదే తొలిసారి.
కాగా, దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఈ టోర్నీ కోసం హైదరాబాద్ రానున్నారు. స్విస్ సిస్టమ్‌లో తొమ్మిది రౌండ్‌ల పాటు టోర్నీ జరుగనుంది. ఈ మెగా టోర్నమెంట్ మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే క్రీడాకారులకు పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ఓవరాల్‌గా 94 నగదు బహుమతులు, మరో 300 మందికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నట్టు స్లాన్ స్పోర్ట్ సిఒఓ నవీన్ వివరించారు. ఇదిలావుంటే టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కాగా, ఈ టోర్నీలో పోటీ పడాలనుకునే క్రీడాకారులు 7386377787 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.