Monday, November 25, 2024

కొత్త శిక్షాస్మృతులు: ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి, పౌర హక్కులు రక్షించబడాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆగస్టు 11, 2023 లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ నూతన బిల్లుల వల్ల భవిషత్తులో అనేక మార్పులు రానున్నాయి. 164 ఏళ్ల క్రితం థామస్ మెకాలే రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్‌నే మనం ఇంత కాలం ఉపయోగిస్తూ వచ్చాం. కాంగ్రెస్ హయాంలో 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొన్ని మార్పులు ప్రవేశపెట్టినా అవి నామమాత్రమే. 1898లో బ్రిటిష్ కాలంలో రూపొందించబడిన క్రిమినల్ చట్టాలనే ఇంతకాలం అనుసరిస్తూ వచ్చాం. కాలానుగుణంగా వాటిని మార్చింది లేదు.
ఆనాటి చట్టాలు బ్రిటిష్ వారు, వారి పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందించి కొన్నవే.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే మొత్తం న్యాయ వ్యవస్థలో పాత చట్టాలను సంస్కరించి, నూతనంగా తిరగ రాసేందుకు దేశంలోని న్యాయం నిపుణులకు ఈ బాధ్యతలు అప్పగించింది. కొన్నేళ్ళ కృషి తర్వాత ఈ న్యాయ సంహితకు సంబంధించిన చట్టాల నమూనా రూపొందించారు. సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తెచ్చారు. ఇంత కాలం నేరస్థులు శిక్ష పడకుండా స్వేచ్ఛగా తిరుగుతూ, మరిన్ని నేరాలకు పాల్పడుతున్న సామాజిక అస్థిరస్థితిని మనం ఇంతకాలం చూస్తూనే ఉన్నాము. ఆ ముష్కరులు అశాంతికి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ధోరణలను మనం రోజూ మీడియాలో చూసేదే. వీటిని అరికట్టాలంటే చట్టంలో లోపాలు సవరించి, పోలీసు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరిగి తీరాలి.

1. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో చేయబోయే కొత్త చట్టం ‘భారతీయ న్యాయ సంహిత’ 2023 బిల్లును తీసుకొచ్చింది. 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానాల్లో కొత్త చట్టం ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ 2023 బిల్లును తెచ్చింది. 3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త చట్టం ‘భారతీయ సాక్ష్య సంహిత బిల్లు’ 2023ను రూపొందించింది. ఈ మూడు బిల్లులను మరింత లోతుగా పరిశీలన జరిపి లోప రహితంగా చూడటం కోసం పార్లమెంటరీ ప్యానల్‌కు పంపనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటి వరకు పాత కాలం నాటి చట్టాలు నేరస్థులను శిక్షించడమే తప్ప న్యాయం చేయడంలో విఫలమైనాయి. కేసుల విచారణలో అనవసరమైన, అంతులేని జాప్యాన్ని అరికట్టి, సత్వర న్యాయం కలిగించే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాలను రూపొందించారు. న్యాయ ప్రక్రియలో సరళతర విధానాలను ప్రవేశపెట్టారు. కాలం చెల్లిన వాటిని రద్దు చేశారు. సాక్షాలను సమన్వయ పరచి శిక్ష పడాల్సిన వారు తప్పించుకోకుండా చూడటం. పిల్లలు, స్త్రీల పట్ల జరిగే నేరాలను తీవ్రంగా పరిగణించడం. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయడం.

ఈ చట్టాల లక్ష్యంగా ప్రకటించారు. వీటిల్లో చట్టపరమైన అంశా లు, వ్యవస్థ పనితీరు, నిర్వాహణ అంశాలు చర్చకు వస్తాయి.75 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని పలు మార్లు మార్చినా న్యాయ వ్యవస్థ తీరుతెన్నులో ఏ మాత్రం మార్పులు రాలేదు. ఇప్పటికే దాదాపు 5 కోట్ల కేసులు వివిధ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. స్త్రీలపై సామూహిక అత్యాచారాలు, ప్రజల ఆస్తుల విధ్వంసాలు, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించడం వంటి ఘోరమైన నేరలకు పాల్పడిన వారు సైతం తప్పించుకొని తిరుగుతూ ఉంటే, అమాయకులు జైళ్ళలో మగ్గుతున్నారు. అమాయకులను కాపాడి నేరస్థులను శిక్షించాల్సిన న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల కొరత, సిబ్బంది కొరతలతో నత్తనడకన నడుస్తున్నది. కేసులతీరు, కేసుల సంఖ్య ఆధారంగా ఇంకా అనేక ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయవలసి ఉంది. కోర్టులు పని చేసే వేళలు, పని గంటలు నిర్ణయించాలి. కోర్టుల సెలవులపై సమీక్ష జరపాలి.
చిన్న చిన్న నేరాలకు పాల్పడిన అభాగ్యులు విచారణ జాప్యంతో దీర్ఘ కాలం శిక్షలు అనుభవిస్తున్నారు.

ఇకమీదట అలా జరగకుండా చూడాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి తోడు ఈ చట్టాల్లో డిజిటల్ ఎలెక్ట్రానిక్ సాక్షానికి (ఆడియో, వీడియో) కూడా వీలు కల్పించారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కేసులు రిజిష్టరు చేసుకోవచ్చు. ఎక్కడైనా జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రజలే ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆన్‌లైన్‌లో కూడా దాఖలు చేసేందుకు అనుమతించడం వంటి వినూత్న ప్రతిపాదనలు ఈ చట్టాల్లో ఉన్నాయి. అంతేకాదు, దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించవలసి వస్తే సాక్షాలు బలంగా, పారదర్శకంగా ఉండేందుకు ఆ సోదాలను వీడియో రికార్డు చేస్తారు. ఒకవేళ నేరస్థులు దొరకున్నా లేదా తప్పించుకున్నా విచారణ ప్రక్రియ ఆగదు. వారి ఆస్తులు జప్తు చేస్తారు.బ్యాంక్ లావాదేవీలు నిలిపివేస్తారు. మూడేళ్లలో న్యాయం అందించేందుకు నిబంధనలను విధించడం వంటివి న్యాయ వ్యవస్థ వేగంగా పని చేసేందుకు దోహదం చేస్తాయి. డిజిటల్ సాంకేతికత వల్ల కేసుల ఫైల్ ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉండదు.

సాక్ష్యాలు నిర్ధారించడం సులభతరం అవుతుంది. లైంగిక హింసకు గురైనటువంటి ఒక స్త్రీ వాంగ్మూలాన్ని ఆమె నివాసంలోనే మహిళా మెజిస్ట్రేట్ రికార్డు చేయటమే కాక, ఆమె పేరు బయట పెట్టడాన్ని శిక్షార్హంగా చేశారు. మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తారు. మరణ శిక్షలు విధించవచ్చు. 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్షపడే నేరాలకు పాల్పడిన వారిని డియస్‌పి స్థాయి అధికారి అనుమతి లేకుండా అరెస్టు చేయడానికి ఇకపై అవకాశం ఉండదు. దీని వల్ల అభాగ్యులను ఇష్టానుసారం అరెస్ట్ చేయడానికి వీలు ఉండదు.అరెస్ట్ అయిన సమాచారాన్ని ఇకపై దాచిపెట్టకుండా సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి జిల్లాలో, ప్రతి పోలీస్ స్టేషన్‌లో అరెస్టుకు బాధ్యత వహించేందుకు, అరెస్ట్ అయిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ప్రభుత్వాలు ఒక అధికారిని నియమించాల్సి ఉంటుంది.

ఏ బాధితుడికైనా దర్యాప్తు ప్రగతిని 90 రోజుల్లోపు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుం ది. ఒక కేసులో దర్యాప్తు 140 రోజుల్లో పూర్తి చేసి, చార్జిషీటును 90 రోజుల్లోపు దాఖలు చేయవలసి ఉంటుంది. న్యాయాధికారులు చార్జిషీట్ దాఖలైన వెంటనే 60 రోజుల్లో కోర్టు ఆరోపణలను నిర్ధారించి, విచారణ జరిపి 30 రోజుల్లో తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఏడు రోజుల్లో తీర్పు కాపీని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తమ గరిష్ఠ శిక్షలో సగానికి పైగా శిక్ష అనుభవించిన విచారణలో ఉన్న ఖైదీలకు ఎవరి ప్రమేయం లేకుండానే బెయిలు లభిస్తుంది. ఇక తరచూ వాయిదాలు కోరకుండా వాయిదాల సంఖ్య పరిమితం చేశారు. వేరే కోర్టులో విచారణ ఉన్నదని వాయిదా కోరి, కేసును ఆలస్యం చేయటానికి ఇకమీదట వీలుండదు. సాక్షుల భద్రతకు కూడా కొత్త చట్టాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఐఆర్ చార్జిషీట్ నుంచి కోర్టు తీర్పుల వరకు అన్నీ ఇక డిజిటల్ రూపంలోనే డాక్యుమెంట్లు ఉంటాయి.

వాద, ప్రతివాదాల వివరాలు పొందేందుకు ఇరు పక్షాలకూ వీలు కల్పించారు. ఈ కొత్త చట్టాలను పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలించి అభ్యుదయ లక్షణాలు తీసుకు రావడంలో మేధావులు, న్యాయ నిపుణులు, సామాజిక, ఆర్థిక, శాస్త్రవేత్తల సలహాలు కోరవచ్చు. ఈ నూతన చట్టాలతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. ఈ నూతన చట్టాల్లో ప్రజలు స్వాగతించవలసిన అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News