Friday, December 20, 2024

పాడేరు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం

- Advertisement -
- Advertisement -

లోయలోకి దూసుకెళ్లిన ఆర్‌టిసి బస్సు
ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం, 30 మందికి తీవ్రగాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  ఎపిలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్‌టిసి బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోగా, చిన్నారులు సహా 30 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సిఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ మలుపు వద్ద ఆర్‌టిసి బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మలుపులో రహదారికి అడ్డంగా భారీ వృక్షం రోడ్డుపై ఒరిగి ఉందిదాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. 50 అడుగుల లోతు వరకు లోయలోకి వెళ్లిన బస్సు ఓ చెట్టు అడ్డు తగలటంతో ఆగిపోయింది.

బస్సు ఒక్కసారిగా లోయలోకి వెళ్లడంతో అందులో ఉన్న 40 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఏం జరిగిందో తెలుసుకొనేలోపే బస్సు లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాందలో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి యత్నించినా సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ అందుబాటులో లేక అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయ చర్యలు చేపట్టి ప్రయాణికుల్ని కాపాడారు. గాయాలతో రక్తమోడుతున్న క్షతగాత్రులను అతికష్టం మీద లోయలోంచి పైకి లాగారు. కొందరిని బస్సులో, మరికొందరిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సత్తిబాబుకు తీవ్రగాయాలయ్యయి. ప్రమాదంలో సబ్బవరం మండలం సురెడ్డిపాలేనికి చెందిన ఈశ్వరరావు, ఆయన భార్య నారాయణమ్మ చనిపోయారు. పాడేరులో ఉన్న మనవడు, మనవరాలిని చూసేందుకు వీరు పాడేరుకు వస్తున్నట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో ఏడాది వయసులో పున్న చిన్నారి, ఆమె తల్లి ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు చిన్నారులు ప్రమాద స్థాయి ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎస్‌పి సహాయ చర్యలను పర్యవేక్షించారు. బస్సు ప్రమాద బాధితులను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పరామర్శించారు. ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు గాయపడినట్లు ఆయన తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం నలుగురు క్షతగాత్రులను కెజిహెచ్‌కు తరలించామని వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. పాడేరులో జరిగిన ఆర్‌టిసి బస్సు ప్రమాద ఘటనపై ఎపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు కారణాలపై దృష్టి సారించాలని సూచించారు. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్‌టిసి బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాడేరు ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వ్యూ పాయింట్ వద్ద బస్సు ప్రమాదం కలచి వేసిందన్నారు. పాడేరు బస్సు ప్రమాద ఘటనపై బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖ తరలించి వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News